బెంగళూరు రేవ్ పార్టీ కేసు వ్యవహారంలో మీడియా చానల్స్ మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నటి హేమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు.. ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. తాజాగా ఈ కేసులో బెంగళూరు పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని న్యూస్ ఛానెల్స్‌పై హేమ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో ఎలా అయితే పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయని, ఇప్పుడు మళ్లీ అదే పాత వార్తలను తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నాయంటూ ఆమె మండిపడ్డారు. హేమకు పాజిటివ్ వచ్చిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మీడియాను దుయ్యబట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ తానే ఇంకా చూడలేదని చెప్పిన హేమ.. మీరు ఎలా చూశారంటూ మీడియాపై చిందులుతొక్కారు.