Karishma Sharma : రైలు నుంచి దూకిన నటి కరిష్మా శర్మ.. ఆస్పత్రిలో నటి..

Update: 2025-09-12 06:57 GMT

రాగిని ఎంఎంఎస్‌: రిటర్న్స్, ప్యార్ కా పంచనామా 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటి కరిష్మా శర్మ అకస్మాత్తుగా వార్తల్లో నిలిచారు. కదులుతున్న రైలు నుంచి కంగారులో కిందకు దూకి ఆమె గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన గురించి వివరిస్తూ కరిష్మా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. "నేను ఒక సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లడానికి చీర ధరించి ముంబై లోకల్ రైలు ఎక్కాను. రైలు వేగంగా కదలడం మొదలుపెట్టడంతో నా స్నేహితులు ఎక్కలేకపోయారు. వారు వెనక ఉండిపోయారన్న భయంతో నేను వెంటనే కిందికి దూకేశాను. దురదృష్టవశాత్తూ వెనక్కి తిరిగి పడడంతో నా వీపు, తలకు దెబ్బలు తగిలాయి" అని రాశారు.

శరీరంపై చిన్న చిన్న గాయాలు అయ్యాయని, తలకు దెబ్బ తగలడంతో వైద్యులు ఎంఆర్‌ఐ చేశారని, ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని సూచించారని ఆమె తెలిపారు. తాను ధైర్యంగా ఉన్నానని, త్వరగా కోలుకోవాలంటే అందరి ప్రేమాభిమానాలు కావాలని కోరారు. ప్రమాదం జరిగినప్పుడు కరిష్మాను చూసి తాను షాక్‌ అయ్యాయని ఆమె స్నేహితురాలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "కరిష్మా రైలులో నుంచి పడిపోయింది. మేము వెళ్లి చూసేసరికి తనకు ఏమీ గుర్తులేదు. వెంటనే ఆసుపత్రికి తరలించాం" అని తెలిపారు.

నటి కరిష్మా శర్మ పలు సినిమాలు, ధారావాహికలతో పాటు రియాలిటీ షోలలో కూడా నటించారు. కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షోలలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Tags:    

Similar News