సినిమా దర్శకత్వానికి అత్యంత దగ్గరగా ఉండే టెక్నీషియన్ ఎవరైనా ఉంటే అది సినిమాటోగ్రాఫర్సే. డైరెక్షన్ పై వీరికి ఉండే కమాండ్ మరే టెక్నీషియన్ కూ ఉంటుంది. ఫ్రేమింగ్, టేకింగ్, మేకింగ్ అంశాల్లో ఆయా సినిమాల దర్శకుల కంటే ఎక్కువ ప్రతిభ వీరి సొంతం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే డైరెక్షన్ వైపు వస్తుంటారు. వచ్చిన వారిలో సక్సెస్ అయిన వారూ తక్కువే కావడం విశేషం. సినిమాటోగ్రాఫర్స్ గా లెజెండ్స్ అనిపించుకున్న పిసి శ్రీరామ్, సంతోష్ శివన్ వంటి వారు దర్శకత్వంలో ఫెయిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో కేవి గుహన్ దర్శకత్వం వైపు వచ్చాడు కానీ సూపర్ సక్సెస్ కాలేదు. మరో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ తో ఉన్నాడు. తాజాగా మరో కెమెరామేన్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు.
ఉల్లాసంగా ఉత్సాహంగా, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, ఒక్కడినే, మసాలా, ఒక లైలా కోసం, తేజ్ ఐ లవ్యూ వంటి చిత్రాలకు కెమెరామేన్ గా పనిచేసిన ఐ ఆండ్ర్యూ మెగా ఫోన్ పడుతున్నాడు. శివ కందుకూరి, అనూ ఇమ్మానుయేల్ జంటగా బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్ మూవీ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందబోతోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా చెబుతోన్న ఈ మూవీ మొత్తం లండన్ లోనే చిత్రీకరణ జరుపుకోబోతుండటం విశేషం. వణుకు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉంటాయట. మరి ఈ కెమెరామేన్ దర్శకుడుగా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూద్దాం.