కొన్ని బ్యానర్స్ పేరు చెబితే తెలియకుండానే రెస్పెక్ట్ పెరుగుతుంది. అది ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలను బట్టి కలిగే అభిప్రాయం. సంస్కారవంతమైన సకుటుంబ కథా చిత్రాలతో అతి తక్కువ కాలంలోనే ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న ఆ సంస్థ హారిక అండ్ హాసిని. త్రివిక్రమ్ చేతులమీదుగా నామకరణం చేసుకుని.. ఆయనతో మాత్రమే సినిమాలు తీస్తూ.. అఖండ విజయాలు సాధిస్తూ.. అప్రతిహతంగా కొనసాగుతోన్న హారిక అండ్ హాసిని బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు పుట్టిన రోజు ఇవాళ.
హారిక అండ్ హాసిని.. ప్రామిసింగ్ మూవీస్ తో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఈ బ్యానర్ లో సినిమా వస్తోందంటే అది కుటుంబమంతా కలిసి చూసే వేడుకయిపోయింది. బలమైన కథలతో తమదైన ముద్రను టాలీవుడ్ లో బలంగా వేస్తూ.. వరుస విజయాలు సాధిస్తోన్న ఈ సంస్థ త్రివిక్రమ్ మనసుకు నచ్చిన బ్యానర్. అందుకే కంటిన్యూస్ గా ఈ సంస్థలోనే సినిమాలు చేస్తున్నారు మాటల మాంత్రికుడు..
సూర్యదేవర రాధాకృష్ణ.. చినబాబుగా ఫేమస్ అయిన ఈ నిర్మాత పేరు వినగానే బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. అంటే కేవలం బ్లాక్ బస్టర్స్ తీయలేదాయన. ఆయన తీసినవే బ్లాక్ బస్టర్ అయ్యాయి. స్క్రిప్ట్ దశ నుంచి ప్రొడక్షన్, బిజినెస్, మార్కెటింగ్ వరకూ మనసు పెట్టి పని చేసే నిర్మాత ఆయన.
సినిమా నిర్మాణం రిస్క్ అయిపోయిందని ఎన్నో పెద్ద నిర్మాణ సంస్థలు కూడా పునరాలోచనలో పడిన టైమ్ లో అత్యంత ప్యాషనేట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చినబాబు. సీనియర్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన విజయాలకు తన బ్యానర్ ను అడ్రెస్ లా మార్చారు. ఒక నిర్మాణ సంస్థ సక్సెస్ వెనక కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు.. మంచి కథలతో పాటు.. ఆ కథల్ని అందంగా చెప్పగలిగే దర్శకుడిని వెదుక్కోవాలి.. ఆపై ఆ సినిమాను విపరీతంగా ప్రేమించగలగాలి. అప్పుడే ఆ సంస్థ అందరి మన్ననలు పొందుతుంది. ఈ విషయంలో చినబాబు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. కాబట్టే హారిక అండ్ హాసిని అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ సంస్థగా మారింది.
సినిమా కొందరు నిర్మాతలకు వ్యాపారం, మరికొందరికి వ్యసనం, ఇంకొందరికి ప్యాషన్.. ఈ మూడూ కలిసి ఉన్న అరుదైన నిర్మాతే చినబాబు. అయితే ఆయన ఇంత ప్యాషనేట్ గా సినిమాలు తీయడం అంటే దీని వెనక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అనుకుంటారు కొందరు. నిజమే.. చినబాబు ప్యాషన్ వెనకా ఓ కథ ఉంది. ఆ కథలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడా కథ తెలియాలంటే మనం 1988కు వెళ్లాలి. టాప్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ను ఇష్టపడి ఆయన ఆదర్శంగా ఓ సినిమా నిర్మించారు చినబాబు. ఆసినిమా పేరు ఆత్మకథ. మహేష్ భట్ హిందీలో తీసిన జనమ్ సినిమాను తెలుగులో ఆత్మకథగా రీమేక్ చేశారు చినబాబు. ఈ సినిమాలో ఆయన పేరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గానే పడ్డా.. నిర్మాత కూడా ఆయనే. లెజెండరీ డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు డైరెక్షన్ లో నాటి తమిళ స్టార్ మోహన్ హీరోగా ఖుష్బూ హీరోయిన్ గా శరత్ బాబు, జయసుధ, రమాప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో నిర్మాత అంటే తను అనుకున్నంత సులువు కాదని ఆ సినిమా తర్వాత మళ్లీ తన వర్క్ లోకి వెళ్లిపోయారు చినబాబు.
పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలంటారు. అలా ముఫ్ఫై ఐదేళ్ల క్రితం తను పోగొట్టుకున్న తన ఫీలింగ్స్ ను వెదుక్కుంటూ వెనక్కి వచ్చారు చినబాబు. ఈ మధ్యలో ఎంతోమందికి ఇన్స్పైరింగ్ గా నిలిచే ఈయన కథ కూడా తెలుసుకోవాలి. తండ్రి లాయర్, అక్క లెక్చరర్ అయినా తనదైన ఇండివిడ్యువాలిటీ కోసం చదువు కాగానే ఉద్యోగం వెదుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. పాతికేళ్లు ఉద్యోగం చేశాక మళ్లీ నిర్మాతగా మారాలనుకున్నారు. అందుకూ కారణాలు లేకపోలేదు. ఉద్యోగం చేస్తోన్న టైమ్ లో త్రివిక్రమ్ మాటలు రాసిన సినిమాలతో పాటు ఆయన శైలిని కూడా బాగా ఇష్టపడ్డారు. మళ్లీ సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత.. పాత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని డైరెక్ట్ గా రంగంలోకి దిగకుండా కెమెరామేన్ గంగతో రాంబాబు, నాయర్ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇదే టైమ్ లో త్రివిక్రమ్ తో పరిచయం స్నేహంగా మారింది. ఇండస్ట్రీలో చాలా స్నేహాలు ఆర్థిక సంబంధమైనవే అంటారు. కానీ వీరి స్నేహం అలాంటిది కాదు. అందుకే ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో అరుదుగా కనిపించేలా వీరి బంధం ఉంటుంది. కెమెరామెన్ గంగతో రాంబాబు, నాయక్ ల ద్వారా వచ్చిన అనుభవాన్ని తొలి సినిమాకు పెట్టుబడిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణం రిస్క్.. రెగ్యులర్ గా ఇండస్ట్రీలో వినిపించే మాట ఇది. ఆ రిస్క్ కు రెడీ అయ్యారు చినబాబు. తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడుగా.. అల్లు అర్జున్ హీరోగా జులాయి మొదలైంది. ఇక తన బ్యానర్ పేరు కూడా త్రివిక్రమ్ పెట్టిందే. చినబాబు కూతుళ్ల పేర్లైన హారిక, హాసినిల పేర్లే బ్యానర్ గా మార్చి.. త్రివిక్రమ్ తీసిన జులాయి.. ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ విజయం చినబాబుకు కొండంత బలాన్నిచ్చింది.
జులాయి.. ఈ ఒక్క సినిమాతోనే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పేరు మార్మోగిపోయింది. ఓ కొత్త నిర్మాతలో ఇంత కమిట్మెంట్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఏ నిర్మాతైనా ఎంత ఆనందపడతాడో అందరికీ తెలుసు. కానీ చినబాబు ఏకంగా తనకెంతో ఇష్టమైన మిత్రుడు, దర్శకుడికి తన బ్యానర్ ను అంకితం చేశారు. చినబాబులోని ఫ్రెండ్లీ క్వాలిటీ ఎంతో నచ్చడం వల్లే త్రివిక్రమ్ కూడా ఇదే బ్యానర్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అందుకే ఇది ఆర్థిక బంధం కాదు.. అసలైన స్నేహబంధంగా నిలుస్తోంది. స్నేహం అంటేనే విలువల కలబోత. ఆ విలువల్నే కథలుగా మలచి త్రివిక్రమ్ ఈ బ్యానర్ లో చేసిన రెండో సినిమా సన్నాఫ్ సత్యమూర్తి మరో బ్లాక్ బస్టర్..
కథకు కనెక్ట్ అయినప్పుడు ఖర్చు విషయంలో ఏ నిర్మాతా కాంప్రమైజ్ కాడు. ఇక అభిరుచి కలిగి, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే చినబాబు వంటి నిర్మాతలు ఆ విషయం అస్సలు ఆలోచించరు. అలాగే మనసులు తెలిసిన మిత్రులు చేసే సినిమా అందరి మనస్సుల్నీ కొల్గగొడుతుంది. సన్నాఫ్ సత్యమూర్తి విషయంలోనూ మళ్లీ అదే రిపీట్ అయింది. రెండు సినిమాల విజయం తర్వాత చినబాబు వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం అని అటు పరిశ్రమ పెద్దలే కాదు ప్రేక్షకులూ ఫీలయ్యారంటే అతిశయోక్తి కాదు.
సినిమా అనేది బిజినెస్. ఎంత గొప్ప కథైనా కరెన్సీ మీదుగానే ఆడియన్స్ ను చేరాలి. అందుకే మాగ్జిమం స్టార్స్ తోనే జర్నీ చేయాలనుకుంటారు నిర్మాతలు. కానీ చినబాబు అలా కాదు.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే నితిన్ హీరోగా సినిమా చేశారు. ఇది చాలామంది ఊహించలేదు. నితిన్, సమంత జోడీగా వచ్చిన ఈ మూవీ ఆ బ్యానర్ వాల్యూను మరింత పెంచేంత పెద్ద విజయం సాధించింది.
అ ఆ .. తర్వాత హారిక హాసినితో పాటు తన అన్న కొడుకు నాగవంశీ నిర్మాతగా సితార బ్యానర్ లో రూపొందించే సినిమాలు సైతం చినబాబు టేస్ట్ కు తగ్గట్టుగానే కనిపిస్తాయి. సితార బ్యానర్ నుంచి వచ్చిన ‘బాబు బంగారం, ప్రేమమ్‘ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. చినబాబు అనే పేరుకు త్రివిక్రమ్ అన్న మాట పర్యాయ పదం అయిపోయింది. వీరికి పవన్ కళ్యాణ్ కూడా తోడవడంతో ఈ కలయికలో సినిమా అనౌన్స్ అయింది. పవన్ 25వ సినిమా అనే మరో బాధ్యతనూ తీసుకున్నారు. కానీ సినిమా ఆశించినంతగా అలరించలేకపోయింది. అయినా ప్రొడక్షన్ పరంగా తిరుగులేని మార్కులు కొట్టేసింది. ఈ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్స్ ను ఆదుకుని చరిత్ర సృష్టించారు చినబాబు. ఒక సినిమా పోతే ఎవరినీ పట్టించుకోని నిర్మాతలున్న సమయంలో చినబాబు చూపిన ఔదార్యం పరిశ్రమకే ఆదర్శంగా నిలిచింది.
కొన్ని కాంబినేషన్స్ గురించి ఆడియన్సే కాదు.. పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది. అలాంటిదే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్. ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన వీరి కాంబోలో హారిక హాసిని బ్యానర్ లో సినిమా అనౌన్స్ అయింది. ఊహించినట్టుగానే భారీ స్పందన వచ్చింది. త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా ఎన్టీఆర్ లోని గ్రేట్ యాక్టర్ ను ఎలివేట్ చేస్తూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన అరవింద సమేత వీరరాఘవ సూపర్ హిట్ గా నిలిచింది. కాంబినేషన్ అంచనాలకు తగ్గట్టుగా కమర్షిల్ విజయం సాధించింది అరవింద సమేత. అరవింద సమేత వీరరాఘవ.. కాస్త రొటీన్ అనిపించే సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ నుంచి ఓ కొత్త తరహా కథగా వచ్చింది. ఇప్పటి వరకూ వచ్చిన సీమ కథలకు భిన్నంగా.. అందర్నీ చంపేసి ఆఖర్లో సందేశాలు ఇవ్వకుండా.. ఆరంభం నుంచి పగలు ప్రతీకారాలను వ్యతిరేకిస్తూ సాగిన కథనం కట్టిపడేసింది. దీనికి తమన్ సంగీతం, పూజాహెగ్డే పర్ఫార్మెన్స్ కు తోడు త్రివిక్రమ్ మాటలు మరింత ప్లస్ గా నిలిచాయి.
ఇక సితార సంస్థలో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విజయం సాధించింది. తర్వాత వచ్చిన జెర్సీ, భీష్మ, రంగ్ దే, డి.జే టిల్లు, భీమ్లా నాయక్, సార్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకూ మహరాజ్ వంటి బ్లాక్ బస్టర్స్ తో ఈ బ్యానర్ సైతం టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.అలాగే కొత్తగా వస్తోన్న దర్శకులు ద్వితీయ విఘ్నం దాటాలంటే సితార బ్యానర్ లో సినిమా చేయాలి అనేంతగా ఈ బ్యానర్ పరిశ్రమకే ఓ సెంటిమెంట్ గా మారింది.
హారిక హాసిని బ్యానర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగేలా చేసింది అల వైకుంఠపురములో. త్రివిక్రమ్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. కమర్షియల్ గానే కాక విమర్శియల్ గానూ మెప్పించింది. ఈసినిమా పాటలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాయి. అలాగే బుల్లితెరపై సైతం హయ్యొస్ట్ రేటింగ్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సితార సంస్థ నుంచి రవితేజ ‘మాస్ జాతర‘ రిలీజ్ కు రెడీ అవ్వగా.. ‘సూర్య 46, లెనిన్, బ్యాడాస్, ఆల్కహాల్, విసా, అనగనగా ఒక రాజు‘ వంటి చిత్రాలు పైప్ లైన్లో ఉన్నాయి.
టాలీవుడ్ లోనే మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ గా వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెబుతారు. ఆ కాంబినేషన్ సెట్ అయింది. రీసెంట్ గానే హారిక హాసిని బ్యానర్ లో ఓపెనింగ్ జరుపుకున్న ఈచిత్రం సెప్టెంబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సమ్మర్ లో ఇంటిల్లి పాదినీ అలరించేలాంటి కథతో రాబోతోన్న ఈ మూవీ ఈ బ్యానర్ కు మరో ప్రతిష్టాత్మక విజయాన్నివ్వడం ఖాయం అనుకోవచ్చు.
మొత్తంమీద.. అభిరుచి గల నిర్మాణ సంస్థ హారిక హాసిని నుంచి మరిన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు రావాలని కోరుకుంటూ.. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబుకు మరోసారి బర్త్ డే విషెస్ చెబుతోంది టివి5.
- బాబురావు. కామళ్ల