తన తండ్రి, నటుడు కమల్‌హాసన్‌పై ప్రముఖ నటి శ్రుతిహాసన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్‌హాసన్ ప్రభావం తనపై ఎంతో ఉందని.. ఆయన ఎప్పుడూ తన వెన్నంటి ఉండటం తన అదృష్టమని తెలిపారు. ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం 'కూలీ' విజయం సాధించిన సందర్భంగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి ఈ విషయాలను వెల్లడించారు.
నాపై నాన్న ప్రభావం..
‘‘నేను కమల్‌హాసన్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి వచ్చాను. కాబట్టి నాపై ఆయన ప్రభావం చాలా ఉంటుంది. నా నటనను ఆయనతో పోల్చడం సాధారణంగా జరుగుతుంది, కానీ దానివల్ల నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు’’ అని శ్రుతి అన్నారు. కమల్‌హాసన్ లాంటి గొప్ప నటుడి కుమార్తెగా పరిచయమవ్వడం తన అదృష్టమన్నారు. ‘‘ఆయన ఇండస్ట్రీలోని ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. నాన్న నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణం ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను’’ అని శ్రుతిహాసన్ వివరించారు.
కమల్‌హాసన్ నటించిన 'థగ్‌లైఫ్' చిత్రం మిశ్రమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో బాక్సాఫీస్ నంబర్ల గురించి శ్రుతి స్పందించారు. ‘‘బాక్సాఫీస్ నంబర్లు మా నాన్నను ప్రభావితం చేయలేవు. పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో ఈ నంబర్ల ప్రస్తావన ఉండేది కాదు. మా నాన్న తన సొంత డబ్బు పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనది నంబర్ల గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. వాటి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటారు’’ అని శ్రుతి తెలిపారు.