ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఇందిరాగాంధీ నుంచి సచిన్ వరకు ఎంతో మంది బయోపిక్స్ సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బయోపిక్ సిద్ధమైంది. ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ నిరాకరించడం చర్చనీయాంశమైంది. దీనిపై దర్శక నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.
యోగి ఆదిత్యనాథ్ పేరును ఈ సినిమాలో అజయ్ మోహన్‌సింగ్‌గా మార్చారు. ఈ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్‌కు వెళ్లగా బోర్డు దీనికి సర్టిఫికెట్ నిరాకరించింది. ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని వెల్లడించింది. దీంతో దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారణ జరగనుంది. అయితే, ఈ పిటిషన్ స్వీకరించే సమయంలో కోర్టు సెన్సార్ బోర్డును చెప్పింది. ఎనిమిదేళ్లుగా ప్రజాదరణ పొందుతోన్న నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు కోర్టుకు వెల్లడించారు.
ఈ పుస్తకంపై ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కించిన సినిమాకు సెన్సార్ ఎందుకు నిరాకరించారో తెలపాలని కోర్టు బోర్డును ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేస్తూ సమాధానం కోరింది. కాగా రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో యోగి గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు.