తన అభిమాని హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శన్ సతీమణి విజయలక్ష్మి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కుమారుడి స్కూల్ అడ్మిషన్ గురించి దర్శన్ భార్య తనను సంప్రదించినట్లు డీకే మీడియాకు వెల్లడించారు. "దర్శన్ భార్య విజయలక్ష్మి తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. గతంలో అతడు మా పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత మరో స్కూల్ మారాడు. మళ్లీ మా స్కూల్లో కుమారుడికి అడ్మిషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సహాయం చేస్తానని చెప్పా. అడ్మిషన్ పొందడానికి ముందు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి.. దీని గురించి ప్రిన్సిపల్ తో మాట్లాతానని చెప్పా" అని డీకే శివకుమార్ తెలిపారు.
తన అభిమాన నటుడు దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చు పెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో దర్శన్, పవిత్రాతో సహా మరో 15 మంది జైల్లో ఉన్నారు.