ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈసారి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ని విచారించనుంది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. రానా దగ్గుబాటి జూలై 23న విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన కొంత సమయం కోరడంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ కొత్త తేదీని ఇచ్చింది.ఈ కేసులో రానాతో పాటు ప్రకాష్ రాజ్ (జులై 30), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6), మంచు లక్ష్మి (ఆగస్టు 13) లకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్, విశాఖపట్నం, సూర్యాపేట, సైబరాబాద్‌లలో నమోదైన FIRల ఆధారంగా ఈడీ మొత్తం 29 మంది నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్‌లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద Enforcement Case Information Report (ECIR)ను నమోదు చేసింది. గతంలో, 2021లో, డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా రానాను ఈడీ విచారించింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పట్లో ఈ విచారణ జరిగింది.