PK Rosy: సినీ నటికి గూగుల్ నివాళి.. ఎవరీ పీకే రోజీ
PK Rosy: ఇంట్లో నుంచి బయటకి వెళ్లలేని రోజులు. అందునా ఆడపిల్ల అసలే వెళ్లకూడదు..;
PK Rosy: ఇంట్లో నుంచి బయటకి వెళ్లలేని రోజులు. అందునా ఆడపిల్ల అసలే వెళ్లకూడదు.. అయినా ఆచారాలను, కట్టుబాట్లను అధిగమించి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొట్ట మొదటి మలయాళీ నటిగా చరిత్రకెక్కింది. ఫిబ్రవరి 10,1903న పుట్టిన పీకే రోజీకి గూగుల్ ఘనంగా నివాళి అర్పించింది.
ఆమె చిత్రాన్ని గూగుల్ లోగో మీద ఆవిష్కరించి పీకే రోజీ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాంతో చాలా మందికి ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఆమె గురించిన మరింత సమాచారం కోసం గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
రోజీ అసలు పేరు రాజమ్మ. ఆమె నందనకోడ్ త్రివేండ్రంలో పులయ కుటుంబంలో 10 ఫిబ్రవరి, 1903న జన్మించింది. పేదరికంలో ఉన్న కుటుంబం. దానికి తోడు చిన్నతనంలోనే తండ్రి మరణం. రోజీ చిన్న వయసులోనే పొలం పనులకు వెళుతూ గడ్డి కోసేది. కానీ తనకు కళల పట్ల ఆసక్తి ఉండేది. దాంతో మామయ్య రోజీని ప్రోత్సహించేవారు. సంగీతం, నటనలో ప్రవేశం కల్పించేందుకు ఓ గురువును నియమించారు.
ఆమె మలయాళ చిత్ర సీమలోకి ప్రవేశించిన మొదటి హీరోయిన్. ఆమె JC డేనియల్ దర్శకత్వం వహించిన విగతకుమారన్ (ది లాస్ట్ చైల్డ్) లో నటించింది. ఆ రోజుల్లో, నటన అనేది సాధారణంగా స్త్రీల పని కాదు. నటనను తీవ్రమైన వృత్తిగా భావించే కుటుంబాలు. రోజీకి నటన పట్ల ఉన్న ప్రేమ సమాజం ఆమెను ఎంత వ్యతిరేకించినా, అన్నింటినీ అధిగమించి నటిగా నిరూపించుకునేలా చేసింది.
రోజీ అసలు పేరు రాజమ్మ.. క్రైస్తవమతంలోకి మారి తన పేరును రోసీగా మార్చుకుంది. మేనల్లుడు తనని మతం మార్చుకునేలా చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తుంటారు. రోజీ చదువుకోవాలని క్రైస్తవ మతంలోకి మార్పించాడు మేనల్లుడు. మతం మార్చుకున్న వారికి మాత్రమే ఆరోజుల్లో చదువుకునే అవకాశం లభించేది. అయితే ఆమె తల్లి మాత్రం హిందువుగానే జీవించింది.
ఆమె 1928లో 'విగతకుమారన్' (ది లాస్ట్ చైల్డ్) చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషించిన తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ చిత్రంలో అగ్ర కులానికి చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంది, ఇందులో పురుషుడు ఆమె జుట్టులో ఒక పువ్వును ముద్దుపెట్టుకునే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆమె సినిమాలో సరోజిని అనే నాయర్ మహిళ పాత్రను పోషించింది. చిత్రం విడుదలైనప్పుడు, ఒక దళిత మహిళ నాయర్‌గా చిత్రీకరించడాన్ని చూసి నాయర్ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది మధూర్ గోవిందన్ పిళ్లైతో సహా రోజీని సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు నిరాకరించారు. ప్రేక్షకులు స్క్రీన్‌పై రాళ్లు విసిరి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
ఆమె నాయర్‌గా నటించిన కారణంగా, ఆమె ఇంటిని అగ్రవర్ణాలవారు తగలబెట్టినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దాంతో ఆమె తమిళనాడుకు వెళ్లే లారీలో పారిపోయిందని, లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లైని వివాహం చేసుకుని, "రాజమ్మాళ్"గా జీవించిందని చెబుతారు. రోజీ కథను 2013లో సినిమాగా తెరకెక్కించారు. దీనికి కమల్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం విను అబ్రహం రాసిన నష్ట నాయిక అనే నవల ఆధారంగా రూపొందించబడింది. కొత్త నటి చాందిని గీత.. రోజీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రంలో రోజీని బుద్ది హీనురాలిగా, అగ్రకులాలకు లొంగిపోయినట్లు చిత్రీకరించారు. దాంతో ఈ చిత్రం అనేక విమర్శలను ఎదుర్కొంది.
ఆ తరువాత ఆమె జీవితంపై మరో రెండు సినిమాలు కూడా నిర్మించబడ్డాయి. మహిళా నటుల సంఘం ఫిల్మ్ సొసైటీకి పీకే రోజీ అని పేరు పెట్టుకుని మలయాళ ఇండస్ట్రీలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు.
10 ఫిబ్రవరి 2023న, రోజీ 120వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఆమెని డూడుల్‌తో సత్కరించింది.