HBD Pawan Kalyan: పవర్ స్టార్ నోట సినిమా పాట.. పవన్ పాడిన హిట్ సాంగ్స్
HBD Pawan Kalyan: డైలాగ్‌తో టీజ్ చేయొచ్చు. కానీ పవన్ పాటతో టీజ్ చేస్తారు. అదీ ఆయన స్పెషాలిటీ.. ఆయన చేత పాట పాడించడం కోసమే ఓ పాటను రాయిస్తారు దర్శకులు.. ట్యూన్స్, మ్యూజిక్ అన్నీ కలిసి పవన్ గొంతులో మ్యాజిక్ చేస్తుంది ఆ పాట.;
HBD Pawan Kalyan: డైలాగ్‌తో టీజ్ చేయొచ్చు. కానీ పవన్ పాటతో టీజ్ చేస్తారు. అదీ ఆయన స్పెషాలిటీ.. ఆయన చేత పాట పాడించడం కోసమే ఓ పాటను రాయిస్తారు దర్శకులు.. ట్యూన్స్, మ్యూజిక్ అన్నీ కలిసి పవన్ గొంతులో మ్యాజిక్ చేస్తుంది ఆ పాట. వెరసి సినిమాకే ఆ పాట హైలెట్ అవుతుంది. దటీజ్ పవర్ స్టార్. పుట్టిన రోజు సందర్భంగా ఓ సారి పవన్ పాడిన పాటలు రివైండ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.. అవేంటో మనమూ చూసేద్ధాం..
అన్నయ్య చిరంజీవి సలహాతో సినిమాల్లోకి వచ్చి మొదటి సినిమానే చివరి సినిమా కావాలనుకున్న పవన్ కళ్యాణ్.. ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నారంటే అది ఆయన చేసిన సినిమాల వల్లే సాధ్యం అయింది. ఆయన మ్యానరిజమ్, ఆయన స్టైల్, ఆయన వ్యక్తిత్వం అన్నీ కలిసి పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ చేశాయి.
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'తమ్ముడు ' సినిమాలో రెండు పాటలు పాడారు. మల్లికార్జునరావును ఆటపట్టిస్తూ పాడే 'తాటి చెట్టు ఎక్కలేవు' ఒకటైతే, ఏం పిల్లా మాట్లాడవా.. రెండూ సూపర్ హిట్టయ్యాయి.
పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'ఖుషీ'.. బై బయ్యే బంగారు రమణమ్మ.. తాగిన మత్తులో పవన్ వేసే సరదా స్టెప్పులు, భూమిక పోస్టర్ దగ్గర పవన్ చేసే రచ్చ.. సినిమాకే హైలెట్ ఈ పాట.
పవన్ దర్శకుడిగా మారి చేసిన చిత్రం జానీ.. అందుల్ ఒక బిట్ సాంగ్, ఒక ఫుల్ సాంగ్ ఆలపించాడు.. ఎమ్మెస్ నారాయణ తాగుడు గురించి పవన్ సెటైరికల్‌గా పాడే పాట నువ్వు సారా తాగకు పాటకు ఆ రోజుల్లో వచ్చిన రియాక్షన్ అదుర్స్. అదే సినిమాల్లో సమాజంలోని కొంత మంది మోసగాళ్ల మీద సెటైర్లతో పాడిన పాట 'రావోయి మా ఇంటికి' గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన గొంతులో ఐటమ్ సాంగ్ కూడా అదిరిపోతుందంతే.. గుడుంబా శంకర్‌లో కిల్లీ కిల్లీ అంటూ పాడిన పాటకు ఫ్యాన్స్ ఊగిపోయారు.. ఫుల్ జోష్‌తో సాగే ఆ పాటకు ఫ్యాన్స్ ఫిదా.
తర్వాత పంజా'లో పాపా రాయుడు అంటూ బ్రహ్మానందాన్ని పొగుడుతూనే తిట్టే తీరు ఆకట్టుకుంటుంది. ఫుల్‌మాస్ బీట్ సాంగ్ చాలా రోజులు అభిమానుల నోళ్లలో నానింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మరో బిగ్గెస్ట్ హిట్ 'అత్తారింటికి దారేది'.. ఈ సినిమాలో కాటమ రాయుడా కదిరి నరసింహుడా అంటూ పవన్ మళ్లీ బ్రహ్మానందం భరతం పట్టేలా పాడిన పాట సినిమాకి ప్లస్ పాయింట్ అయిందంటే అతిశయోక్తి కాదు.
ఇదే కోవలో 'అజ్ఞాతవాసి' చిత్రంలోనూ పవన్ ఓ పాట పాడారు.. కొడకా కోటేశ్వరరావు అంటూ ఆయన పాడిన పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదించి పెట్టింది. అందుకే పవన్ కళ్యాణ్ మాట, పాట అన్నీ హిట్టే.. అదే అభిమానులను ఆయనకు చేరువ చేసింది. ఆయనతో కలిసి అడుగులు వేసేందుకు పురికొల్పింది.