జమ్మూకశ్మీర్‌లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని వల్ల ప్రముఖ నటుడు మాధవన్ లేహ్‌లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
భారీ వర్షాల కారణంగా విమానాలు రద్దవడంతో తాను లేహ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని మాధవన్ తెలిపారు. ఈ అనుభవం తనకు 17 ఏళ్ల నాటి పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని ఆయన చెప్పారు. తాను లఢఖ్‌ను సందర్శించిన ప్రతిసారీ ఇలానే జరుగుతోందని ఆయన సరదాగా పేర్కొన్నారు. 2008లో '3 ఇడియట్స్' షూటింగ్ కోసం లఢఖ్‌కు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని మాధవన్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు కురిసిన భారీ మంచు కారణంగా విమానాశ్రయాలు మూసివేయబడ్డాయని, దీంతో నటీనటుల బృందమంతా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, దాని అందం మాత్రం అద్భుతంగా ఉంటుందని మాధవన్ పేర్కొన్నారు.