హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీస్ అంటే స్పెషల్ఇంట్రెస్ట్ చూపించే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్లే మెయిన్ లీడ్ గా కథలను మోసే వాళ్లు. కాసులు కురిపించే వాళ్లు కూడా. బట్ ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగులో కనిపించడం లేదు. తెలుగు సినిమా ఆరంభం నుంచి కూడా హీరోయిన్ ప్రధానమైన కథలున్నాయి. కాకపోతే తొలినాళ్లలో ఆ పాత్రలు చేసిన వాళ్లు ఎక్కువగా విషాదభరితమైన కథలు మోశారు. కుటుంబ బాధ్యతలు తీసుకుని ఆయా సినిమాల విజయాలను అందించారు. ఈ ట్రెండ్ ను మార్చింది విజయశాంతి సినిమాలు. ముఖ్యంగా టి కృష్ణ లాంటి దర్శకుడు చేసిన సినిమాలు హీరోయిన్ అంటే అబల కాదు అని నిరూపించాయి. నేటి భారతం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇవన్నీ సందేశాత్మక చిత్రాలు కూడా కావడం విశేషం.
అలాగే విజయశాంతే చేసిన భారతనారి కూడా అదే కోవలోకి వస్తుంది. కాకపోతే ఈ మూవీస్ లో హీరోలు కూడా ఉంటారు. వారిని దాటి హీరోయిన్ వ్యవస్థపై తిరుగుబాటు చేయడం అనేది హైలెట్ గా కనిపిస్తుంది. ఈ టైమ్ లో మరికొందరు ఈ తరహా చిత్రాలు ట్రై చేశారు. బట్ టి కృష్ణ మూవీస్ లో కనిపించిన ఇంపాక్ట్ ఆ మూవీస్ లేదు అనే చెప్పాలి. అయితే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కు ఓ దారి చూపిన ట్రెండ్ గా చెప్పాలి.
ఈ ట్రెండ్ ను కూడా మార్చిన సినిమా కర్తవ్యం. మోహన గాంధీ డైరెక్ట్ చేసిన కర్తవ్యం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి వరకూ హీరోయిన్లు చీర కట్టుకుని సాధారణంగానే కనిపించారు. బట్ కర్తవ్యంలో విజయశాంతి వైజయంతి అనే ఐపిఎస్ గా లాఠీ పట్టుకుని ఫైట్స్ చేయడం ఇండియన్ స్క్రీన్ ను మెస్మరైజ్ చేసింది. అందుకే కర్తవ్యం ఎన్ని భాషల్లో డబ్ అయితే అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కిరణ్ బేడీ స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే కిరణ్ బేడీని చూసి ఎంత మహిళలు పోలీస్ లు అయ్యారో చెప్పలేం కానీ.. కర్తవ్యం చూసిన తర్వాత వేలాది మహిళలు పోలీస్ ఉద్యోగాలకు వచ్చారు అనేది వాస్తవం. ఆపై విజయశాంతి అన్నీ ఇలాంటి సినిమాలే చేసి ఏకంగా లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది.
లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తోనే తను చేసిన ఒసేయ్ రాములమ్మ తెలుగు సినిమా రికార్డులను బద్ధలు కొట్టింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే వచ్చినా.. సామాజిక అసమానతలపై ఈ మూవీ వేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. చాలా కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. కేవలం విజయశాంతి ప్రధానంగా కనిపించిన ఈ మూవీ సృష్టించిన రికార్డ్స్ చూస్తే లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో మంచి కథ, కథనాలు ఉంటే హీరోలను మించి విజయాలు సాధించొచ్చు అని ప్రూవ్ చేసింది.
విజయశాంతి తర్వాత ఆ స్థాయిలో కాదు కానీ కాస్త ప్రభావం చూపించిన సినిమాలు అంతపురం కనిపిస్తుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయగల సత్తా ఉన్నా.. ఎందుకో సౌందర్య హీరో చాటు హీరోయిన్ గానే ఆగిపోయింది. అలాగే అరుంధతి తర్వాత పంచాక్షరి, రుద్రమ దేవితో అనుష్క కూడా ఆ తరహా మూవీస్ కు బాగా సెట్ అయింది. తనే మెయిన్ లీడ్ చేసిన భాగమతి బ్లాక్ బస్టర్ గా నిలవడం ఇందుకు నిదర్శనం.
అనుకోకుండా ఒక రోజుతో ఛార్మీ, గీతాంజలి తో అంజలి, యూ టర్న్, ఓ బేబీ మూవీస్ తో సమంత వంటి వారు సత్తా చాటారు. బయోపిక్ గా వచ్చిన మహానటి సైతం ఈ కోవలోకే వస్తుందనుకోవచ్చు.
మొత్తంగా ఫీమేలో ఓరియంటెడ్ కథలను తెలుగు సినిమా పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పాలి. కానీ ఆ కథలకు కాలం చెల్లలేదు. అందుకు తమిళ్ లో చేస్తోన్న నయనతార ఉదాహరణ. తనకు ఓ టైర్ టూ హీరోకు ఉన్నంత మార్కెట్ ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసిన తర్వాతే క్రియేట్ అయింది. నయన్ సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనే టాక్ వచ్చిందంటే.. మంచి కథలు ఎంచుకోవడమే కారణం. అలాంటి కథలను మనవాళ్లు ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం లేదో.. లేక నయన్ లా బలమైన నటన చూపించేవాళ్లు లేరు అనుకుంటున్నారేమో కానీ.. నిజంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే చిన్న చూపు కనిపిస్తోంది. ఈ చిన్న చూపు పోయి మళ్లీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుందేమో చూడాలి.