Hari Hara Veeramallu : వీరమల్లు తప్పుకున్నాడా.. రాబిన్ హుడ్ వస్తున్నాడు
సాధారణంగా ఓ టాప్ స్టార్ సినిమా విడుదలవుతోందంటే ఆ డేట్ లో స్మాల్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు రావడానికి భయపడతారు. లేదా గౌరవం కొద్దీ తప్పుకుంటారు. మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదల కాబోతోంది. ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్ట్ చేశారు. తాజాగా వచ్చిన పాట ఆకట్టుకుంటోంది. అయితే వీళ్లు అఫీషియల్ గా ఆ డేట్ కు విడుదల చేస్తాం అని ప్రకటించినా రిలీజ్ వరకూ కష్టమే అనే డౌట్స్ కూడా చాలామందిలో ఉన్నాయి.ఇప్పుడు ఆ అనుమానాలను బలపరుస్తూ.. వస్తున్నాడు నితిన్. యస్.. మార్చి 28నే నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీని వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. నితిన్, వెంకీ కాంబోలో ఇంతకు ముందు భీష్మ వంటి హిట్ మూవీ వచ్చి ఉంది.
హరిహర వీరమల్లు డేట్ కు రాబిన్ హుడ్ ను విడుదల చేస్తున్నారు అంటే 99శాతం వీరమల్లు రావడం లేదు అనే అనుకోవాలి. ఇంతకు ముందు పుష్ప 2 ఆగస్ట్ 15 నుంచి తప్పుకుందని అఫీషియల్ గా చెప్పుకుండానే రెండు మూడు మీడియం రేంజ్ సినిమాలు ఆ డేట్ లో రిలీజ్ డేట్ పోస్టర్స్ వేశాయి. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం లేదని పక్కాగా తెలిస్తేనే రాబిన్ హుడ్ ను విడుదల చేస్తున్నారు అనుకోవాలి. అసలే నితిన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అలాంటి హీరో ఆయనతో ఢీ కొట్టడు కదా.అందుకే వీరమల్లు వాయిదా పడినట్టే అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోవచ్చు.
నిజానికి రాబిన్ హుడ్ గత డిసెంబర్ 25న విడుదల కావాలి. కానీ పుష్ప 2 ఇంకా రైజ్ లో ఉందని నిర్మాతలు బలవంతంగా వాయిదా వేయించారు. కనీసం సంక్రాంతికి వస్తుందనుకుంటే అదీ కాలేదు. ఫైనల్ గా మార్చి 28న అన్నారు. విశేషం ఏంటంటే.. అదే డేట్ కు విజయ్ దేవరకొండ నటించిన సినిమా వస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది సితార బ్యానర్ నిర్మిస్తోంది. మరి ఇది ఆ రోజే విడుదలవుతున్నట్టు పోస్టర్ వస్తే.. పక్కాగా వీరమల్లు తప్పుకున్నట్టుగానే అనుకోవచ్చు.