జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ నీల్ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. కేజీఎఫ్, సలార్ వంటి భారీ హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అంచనాలు అధికంగా ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెడుతున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ మీద ప్రశాంత్ నీల్ అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని వారు చెప్పారు. ఈ చిత్రం తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణకొసరాజు ఈ చిత్రానికి నిర్మాతలు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.