బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బిజెపి ఎమ్.పి కంగనా రనౌత్ కొన్నాళ్లుగా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ.. మనసులో ఏది అనిపిస్తే ట్వీట్(ఎక్స్ ) లో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ వస్తోంది. దీని వల్ల అప్పుడప్పుడూ తను మాట్లాడేది నిజమే అనిపించినా జనం పట్టించుకోవడం మానేశారు. ఇంక ఎమ్.పి కూడా అయిన తర్వాత మేడమ్ పట్టుకోలేకపోతున్నారు. అదుపులేని నోటి మాటల వల్ల ఏకంగా పార్టీకే డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. దీంతో కొన్నాళ్ల పాటు పార్టీ తరఫున మాట్లాడొద్దు అని చెప్పారు బిజెపి వాళ్లు. అసలే బిజెపి ఇప్పుడు కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కంగనా మాటలు మరింత డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే తన సొంతంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేసి నటించిన ఎమర్జెన్సీ సినిమాను కూడా విడుదల కానివ్వడం లేదు. కేంద్రంలో వారి పార్టీయే అధికారంలో ఉన్నా.. ఈ చిత్రానికి సెన్సార్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ విషయంలోనూ అసహనం వ్యక్తం చేస్తూ సొంత పార్టీపైనా విమర్శలు చేసింది కంగనా.
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా చెబుతారు చాలామంది. దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని చరిత్రను వక్రీకరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారని.. అది కేవలం బిజెపికి మేలు చేయడం కోసమే రూపొందించారని ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థం అయింది. అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల కానివ్వం అని ప్రకటించారు. సెన్సార్ కూడా ఇందులో ప్రస్తుతం దేశంలో ఇబ్బంది కరమైన పరిస్థితులు తెచ్చే సన్నివేశాలున్నాయని అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో చాలాకాలంగా పోరాడుతున్న కంగనా ఫైనల్ సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించిందట.
తన చిత్రానికి సెన్సార్ అనుమతి వచ్చిందని.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తానని.. ఇన్నాళ్లూ ఎదురుచూసి, సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అని పోస్ట్ లో పేర్కొంది.
మొత్తంగా ఈ చిత్రం కోసం ముంబైలోని తన ఖరీదైన ఇంటిని కూడా అమ్ముకున్నా అంది కంగనా. మరి ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తే ఆ బంగ్లా మళ్లీ కొంటుందేమో.