విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తూ.. నిర్మించిన సినిమా ‘కన్నప్ప’. ఐదు దశాబ్దాల క్రితమే కన్నప్ప చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు బాపు. అయితే వీళ్లు మాత్రం ఆ కథకు పూర్తి భిన్నమైన కంటెంట్ తో వస్తున్నారని ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెట్ చూస్తే అర్థం అవుతుంది. అదీ కాక విపరీతమైన స్టార్ కాస్ట్ తో రూపొందించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మోహన్ బాబు అంటూ భారీ తారాగణమే ఉంది. మరి సినిమాలో ఈ పాత్రలను ఎలా కన్విన్సింగ్ గా చెబుతారో కానీ.. ప్రతిసారీ ఏదో రకంగా వార్తల్లో ఉంచే ప్రయత్నంలో మాత్రం విష్ణు మంచు సూపర్ సక్సెస్ అవుతున్నాడు.
ఇక ఈ నెల 27న విడుదల కాబోతోన్న కన్నప్ప ట్రైలర్ ను ఈ గురువారం విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఆ మేరకు ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. నిజానికి ఆ ప్రోమో చాలా బావుందనే చెప్పాలి. అయితే సడెన్ గా ట్రైలర్ రిలీజ్ చేయడం లేదు అని చెప్పాడు విష్ణు. అందుకు కారణం.. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదమే అంటున్నాడు. ఆ ప్రమాదంలో అంతమంది మరణించిన సందర్భంలో తను ట్రైలర్ ను రిలీజ్ చేయలేనని.. ఒక రోజు ఆగిన తర్వాత విడుదల చేస్తా అని అనౌన్స్ చేశాడు.