మహానటి ఫేమ్ కీర్తి సురేశ్, తన బాల్య మిత్రుడు ఆంటోనీని ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వీళ్ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక అంశాలను పంచుకుంది కీర్తి. క్రిస్టియన్ పద్ధతి గురించి మాట్లాడుతూ.. ఆంటోనీ కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఆ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్నామని చెప్పింది. క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకుందా మనుకున్న తర్వాత తన తండ్రితో మాట్లాడిందట కీర్తి.. ‘నాన్నా.. ఈ సంప్రదాయం ప్రకారం వధువును ఆమె తండ్రి పెళ్లి వేదిక పైకి తీసుకురావాలి. నాకోసం మీరు కూడా ఆవిధంగా చేస్తారా?' అని అడిగితే ‘తప్పకుండా చేస్తాను. మనం రెండు సంప్రదాయాల్లో వివాహం జరుపుతున్నాం. కాబట్టి నేను కూడా ఆ పద్ధతులు పాటిస్తాను’ అని ఆయన బదులిచ్చారు. ఆ మాట తనకెంతో సంతోషాన్నిచ్చిందని అంటోంది కీర్తి. తన తండ్రి క్రిస్టియన్ పద్దతిలో పెళ్లికి అంగీకరిస్తారని ఊహించలేదని చెప్పింది. తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో ఇంటర్ నుంచే డేటింగ్ చేసినట్లు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. ఆయన ఖతర్‌లో ఉన్నా తమ ప్రేమ విడిపోలేదని చెప్పారు.