OTT : హరి హర వీరమల్లు ఓటీటీ వెర్షన్‌లో కీలక మార్పులు.. 15 నిమిషాల నిడివి తగ్గింపు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో విడుదలైన వెర్షన్‌కి, ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న వెర్షన్‌కి కొన్ని కీలకమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పుడు, కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిందని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వినిపించాయి. ఈ విమర్శల నేపథ్యంలో చిత్రబృందం థియేటర్‌లో విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాలను మార్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ఆ సన్నివేశాలను పూర్తిగా తొలగించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్ కల్యాణ్ బాణం గురిపెట్టే సీన్స్‌ను ఓటీటీలో కట్ చేసినట్లు సమాచారం. అలాగే క్లైమాక్స్‌లో కూడా మార్పులు చేశారు. థియేటర్లలో వచ్చిన బాబీ దేవోల్ సంభాషణలు, కొన్ని యాక్షన్ సన్నివేశాలను తొలగించి, ‘అసుర హననం’ పాట తర్వాత పార్ట్ 2 ప్రకటనతో సినిమాను ముగించారట. మొత్తం మీద, సినిమా నుంచి దాదాపు 15 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించి ఓటీటీలో విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం పవన్ కల్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు వారాల తర్వాత సినిమా సడెన్‌గా ఓటీటీలోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హరి హర వీరమల్లు ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కొంత భాగం పూర్తైంది.