National Awards : నేషనల్ అవార్డ్స్ పై మళయాలీల ఆగ్రహం

Update: 2025-08-02 07:36 GMT

71వ జాతీయ పురస్కారాల ఎంపికపై మళయాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నేషనల్ అవార్డ్స్ అంటే మళయాల సినిమా అన్నట్టుగా ఉండేది. ఆ టైమ్ లో సౌత్ నుంచి వాళ్లకు తప్ప ఇంకెవరికీ ఎక్కువ అవార్డ్స్ వచ్చేవి కావు. కొన్నాళ్లుగా పరిస్థితి మారిపోయింది. కోలీవుడ్ తర్వాత తెలుగు వాళ్లు ఎక్కువగా సత్తా చాటుతున్నారు. ఈ సారి కూడా మన సినిమాలు అదరగొట్టాయి. అయితే మళయాలీల ఆగ్రహం మన సినిమాలకు వచ్చినందుకు కాదు. వాళ్లకు రానందుకు. అలాగే కేరళ స్టోరీ సినిమాకు వచ్చినందుకు.

గతేడాది విడుదలైన ‘ఆడుకాలం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కోసం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ సాహసాన్నే చేశాడు. ప్రమాదకరమైన రీతిలో సన్నబడ్డాడు. తన బాడీని రకరకాలుగా మార్చుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపూ పృథ్వీరాజ్ ఈ పాత్ర కోసం ఎంత హార్డ్ వర్క్ చేశాడు అనేది అర్థం అవుతుంది. మళయాలం నుంచి గల్ఫ్ కు వెళ్లి మోసపోయిన ఓ వ్యక్తి కథనే పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో రూపొందించారు. ఆ పాత్రకు బెస్ట్ యాక్టర్ గా అతనికి నేషనల్ అవార్డ్ వస్తుందని సినిమా రిలీజ్అయిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని మీడియంలోనూ వార్తలు వచ్చాయి. బట్ నేషనల్ అవార్డ్స్ జ్యూరీ ఈ పాత్రను గుర్తించలేదు. పృథ్వీరాజ్ కు ఏ అవార్డ్ రాలేదు.

ఇక కేరళ స్టోరీ చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ గా సుదీప్తో సేన్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా పసంతను మొహపాత్రో అవార్డులు అందుకున్నారు. దీనిపైనా కేరళీయలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన సినిమా దర్శకుడికి అవార్డ్ ఎలా ఇస్తారు అంటూ విరుచుకు పడుతున్నారు. ఈ విషయంలో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. అదీ విషయం. మొత్తంగా మళయాలీలు ఈ సారి జ్యూరీతో పాటు కేంద్రాన్ని కూడా నిందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Tags:    

Similar News