Pottel : పొట్టేల్ ట్రైలర్ - సరస్వతికి చదువు చెప్పించేందుకే ఆరాటం..

Update: 2024-10-18 12:31 GMT

పొట్టేల్.. కొన్నాళ్లుగా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం ఏదో రకంగా వార్తల్లో ఉండేలా ప్రమోషన్స్ చేస్తోన్న సినిమా. టైటిల్ చూసి ఇదేదో రెగ్యులర్ తెలంగాణ సినిమా అనుకున్న వాళ్లూ ఉన్నారు. టీజర్ చూసినప్పుడు బావుంది అన్నారు. బట్ ఏ దశలోనూ వీళ్లు ప్రమోషన్ కు అవకాశం ఉన్న సందర్భాన్ని వదులుకోలేదు. థియేటర్స్, బస్ లు, ఆఖరికి విమానాల్లో కూడా తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఈ నెల 25న విడుదల కాబోతోన్న ఈ పొట్టేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే సినిమాపై ఒక అంచనాకు రావచ్చు అనేది నిజం. ఈ ట్రైలర్ చూస్తే మనసుల్ని మెలిపెట్టే ఓ గొప్ప కథ చూడబోతున్నాం అనిపించేలా ఉంది. 1980ల కాలంలో తెలంగాణ సరిహద్దులో మహరాష్ట్రలోని విదర్భకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో జరిగిన కథ ఇది అంటూ మొదలైన ట్రైలర్ లో.. ఆనాటి తెలంగాణ పల్లెల్లో ఉన్న ఆధిపత్యం, అణచివేతలు, పిల్లలను చదువుకు దూరం చేస్తూ జోగిని, మాతంగి వ్యవహారాలు.. ఊరి పెద్దల దురాగతాలు.. వీటిని ఎదురిస్తూ.. సరస్వతి అనే పేరు పెట్టుకున్న తన కూతురుకి చదువు చెప్పించే ప్రయత్నం చేసిన పేద తండ్రి యాతన.. ఇవన్నీ కనిపిస్తున్నాయీ ట్రైలర్ లో. ఈ మధ్య కాలంలో.. ఆ మాటకొస్తే చాలాకాలం తర్వాత సిసలైన తెలంగాణ ఆత్మతో కూడిన కథ చూడబోతున్నాం అనిపిస్తోందీ ట్రైలర్ చూస్తోంటే.

కొన్నాళ్లుగా తెలంగాణ సినిమా అంటే మందు, తాగుడు చాలా అంటే చాలా కామన్ అయిపోయాయి. అదేం అంటే ఇది మా సంస్కృతి అంటున్నారు. బట్ ఈ మట్టికి వేల కొలది కథలున్నాయి. వ్యథలున్నాయి. తడిమి చూస్తే ప్రతి ఊరిలోనూ లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. అవి వదిలేసి మందునే సంస్కృతిగా చూపిన బాటను దాటి తెలంగాణ నేలపై అనేక దుఖాలకు, కన్నీళ్లకు కారణమైన వేలాది కథల్లోనుంచి ఒక కథ వస్తున్నట్టుగా ఉందీ ట్రైలర్. ట్రైలర్ తోనే ఓ బలమైన కథ చూపించబోతున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు దర్శకుడు సాహిత్ మోత్కూరి. నిశాంత్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన ఈ చిత్రంలో యువ చంద్ర, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, ప్రియాంక శర్మ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో విషయం ఉంది అని స్పష్టంగా అర్థం అవుతోంది. అందుకే ఇంత చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే బాధ్యత మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు. నిజంగానే ట్రైలర్ లాగా సినిమా కూడా హృదయాలను తాకితే .. ఇది కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

Full View

Tags:    

Similar News