Singer Ramola : ఓ వెలుగు వెలిగిన రాజబాబు మరదలు .. రమోలా

Update: 2025-11-17 10:54 GMT

గాయని రమోలా.. 1970వ దశకంలో ఒక వెలుగు వెలిగిన సినీ నేపథ్యగాయని. ఈమె గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల నటి, శాస్త్రీయ నృత్యకారిణి కూడా. తల్లి పేరు సీతారామమ్మ. ఈమె పది మంది సంతానంలో తొమ్మిదవ సంతానం. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజ ఈమెకు ఒక అక్క కాగా హాస్యనటుడు రాజబాబు భార్య లక్ష్మీ అమ్ములు ఈమె చెల్లెలు. ఈమె 8వ తరగతి వరకు విజయనగరంలో చదువుకుని పిమ్మట మద్రాసుకు చేరుకుంది. మద్రాసు ఆంధ్రమహిళా సభలో మెట్రిక్ చేసింది. ఈమె చిన్నతనంలోనే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య ఈమెను ప్రోత్సహించారు. మొదట సినిమాలలో కోరస్‌లు పాడటంతో మొదలైన ఈమె సినీ ప్రస్థానం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 3000కు పైగా పాటలు, 75 చిత్రాలలో పాత్రధారణ, మరెన్నో చిత్రాలలో గాత్రధారణలతో ముగిసింది.

ఈమె ఎందరో హీరోయిన్‌లకు, క్యారెక్టర్ యాక్టర్లకు డబ్బింగ్ చెప్పింది. మరపురాని మనిషి, జీవనజ్యోతి, కృష్ణవేణి, నాయుడుబావ, నామాల తాతయ్య, జాతకరత్న మిడతంభొట్లు మొదలైన సినిమాలలో నటించింది. రంగస్థలంపై కుమ్మరిమొల్ల, సప్తపది మొదలైన నాటకాలలో జె.వి.సోమయాజులు, పొట్టి ప్రసాద్, జె.వి.రమణమూర్తి మొదలైన వారి సరసన నటించి గొప్ప పేరు సంపాదించుకుంది.

భరతనాట్యంలో శిక్షణ పొంది వైజయంతిమాల డాన్స్ ట్రూపులో చేరి రాధాకృష్ణ, చండాలిక మొదలైన నృత్యరూపకాలలో నాట్యం చేసి, ఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తా, మాంచెస్టర్ వంటి చోట్ల వందలాది ప్రదర్శనలిచ్చింది. ఈమె గాయని, డబ్బింగ్ కళాకారిణి, నృత్య కళాకారిణి, నటి మాత్రమే కాక రచయిత్రి కూడా. ఈమె సుమారు 35 పాటలను రచించింది.

Tags:    

Similar News