దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టారు. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు మంచి క్రికెటర్ గా ఉన్న రాజమౌళి... ఇప్పటికీ తీరిక దొరికనప్పుడల్లా సరదాగా క్రికెట్ ఆడుతుంటారు. తాజాగా గ్రామీణ ప్రాంతంలోని క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తాము క్రికెట్ ఆడే సమయంలో టీమ్ మొత్తానికి ఒకటే బ్యాట్ ఉండేదన్నారు. అది కూడా ఇప్పుడు ఉపయోగించే బ్రాండెడ్ బ్యాటులాంటిది కాదని... సాధారణ చెక్క బ్యాట్ ఆడేవాళ్లమన్నారు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీకి తాను చాలా పెద్ద అభిమానిని అని చెప్పారు. అతడి సారథ్యంలో భారత్ జట్టు టీ20, వన్డే వరల్డ్‌క్‌పలు సాధించినప్పుడు తన సంతోషానికి అవధులు లేవన్నారు. మరింత మంది ధోనీలు రావాలనేదే తన ఆకాంక్ష అన్నారు. ప్రతిభ ఉన్నా సరైన సదుపాయాలు, దిశా నిర్దేశం చేసేవారు లేక ఎంతో మంది క్రికెటర్లు వెలుగులోకి రాకుండానే వారి కెరీర్ ముగిసిపోయిందన్నారు. గ్రామీన ప్రాంతాల్లోని క్రికెట్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.