Sapthagiri : బ్రహ్మాజీతో రోస్ట్ చేయించుకోవడమే ప్రమోషనా..?

Update: 2025-03-19 10:45 GMT

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది ఎప్పుడో పాత సామెత అయిపోయింది. ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ చేసి చూడు అంటున్నారు. ఒక సినిమాను ప్రేక్షకులు రావాలంటే ప్రాపర్ ప్రమోషన్స్ కావాలి. అయినా రీచ్ కావడం కష్టమే అన్నట్టుగా ఉంది. టైర్ ఒన్ హీరోలైతే ఫర్వాలేదు కానీ ఆ తరవాతి వాళ్లంతా నానా తంటాలు పడితే కానీ ఆడియన్స్ దృష్టి తమ వైపుకు రాదు. అందుకే ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాలో సీన్స్ కోసం ఎంతలా ఆలోచిస్తారో ప్రమోషన్స్ లో వైవిధ్యం కోసం అంత ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో బ్రహ్మాజీ కేంద్రంగా ఓ కొత్త స్ట్రాటజీ స్టార్ట్ అయింది. అతను సినిమా గురించి అడుగుతూ ఆ హీరోను రోస్ట్ చేసేస్తాడు. ముఖ్యంగా ఇమేజ్ లేని వాళ్లను. కొన్నాళ్ల క్రితం సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా అనే సినిమా ఇంటర్వ్యూ లాంటిది ఏర్పాటు చేస్తే.. ఆ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ.. సత్యదేవ్ ను ఓ ఆట ఆడుకున్నాడు. ఓ రకంగా అతన్ని పూర్తిగా డీ గ్రేడ్ చేస్తూనే సాగిందా ఇంటర్వ్యూ. కానీ చాలామంది చూశారు. మొదట అదంతా నిజమే అనుకున్నవాళ్లూ ఉన్నారు. తర్వాతే తెలిసింది ఇదో రకం ప్రమోషనల్ స్ట్రాటజీ అని.

ఆ స్ట్రాటజీనే ఇప్పుడు సప్తగిరి ఫాలో అయ్యాడు. అతనూ బ్రహ్మాజీతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం సుమ వస్తోందనే డైలాగ్ నుంచి ఆడియన్స్ ను డైవర్ట్ చేస్తూ సాగుతుంది. ప్రశ్నలు అడగడం కంటే సప్తగిరిని ఉతికి పడేశాడు బ్రహ్మాజీ. ఇదంతా నిజమే అన్నట్టుగా సప్తగిరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ మూవీలో అంతా తానే అయ్యాడనీ, పోస్టర్స్ మొత్తం అతనే నిండిపోయాడనీ.. అతనికంత సీన్ లేకపోయినా ఫారిన్ లో సాంగ్ చేశారనీ, దిల్ రాజును కాకా పట్టడానికే ఇదంతా.. టీజర్ రిలీజ్ చేయించి ప్రభాస్ ను వాడేశావనీ.. అసలు ఈ సినిమా నేనెందుకు చూడాలని .. ఇలా సాగిందా ఇంటర్వ్యూ. మొత్తం సప్తగిరిని రోస్ట్ చేయడమే ఉంది. మరి ఈ వీడియో సినిమాకు ఎంత ఉపయోగపడుతుందేమో కానీ ఇదేమంత గొప్ప ఐడియాలా మాత్రం అనిపించడం లేదు అనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.

Tags:    

Similar News