యాక్టర్ సైఫ్ అలీఖాన్ కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్‌ను దుండగుడు 6 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయింది.
సైఫ్ అలీ ఖాన్‌పై కత్తిపోట్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2.30 గంటలకు ఈ ఘటన జరగ్గా రా.12.30 గంటల తర్వాత ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఆనవాళ్లు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీన్నిబట్టి దుండగుడు ప్లాన్ ప్రకారం ముందే ఇంట్లోకి చొరబడి ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మండిపడుతున్నాయి.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.