మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.20 లక్షల విరాళాన్ని తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించిన సంగతి తెలిసిందే. ఇక, బుధవారం సాయి దుర్గ తేజ్ విజయవాడలో పర్యటించి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మ అనాథాశ్రమానికి రూ.2 లక్షలు, ఇతర సేవా సంస్థలకు రూ.3 లక్షల విరాళం అందించారు. కాగా అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్…చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. దీంతో సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు కురిపిస్తున్నారు.