సూపర్ స్టార్ రజనీకాంత్.. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కు ఇది 171వ సినిమా. దీంతో ఇప్పటివరకు తలైవర్ 171 వర్కింగ్ టైటిల్గా ఉంది. త్వరలోనే పేరును ప్రకటిస్తామంటూ కొన్ని రోజుల క్రితం టీమ్ ఆసక్తి రేకెత్తించింది. దీంతో 'తంగమ్', 'రాణా' తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మూవీ టీమ్ టైటిల్ ను అఫిషియల్ గా ప్రకటించింది. అదే.. కూలీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియోను విడుదల చేసింది.
'ఖైదీ', మాస్టర్, 'విక్రమ్', లియో సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న లోకేశ్.. రజనీకాంత్ సినిమాని ప్రకటించడమే ఆలస్యం టాలీవుడ్లోనూ ఆసక్తి నెలకొంది. ఓ సందర్భంలో లోకేశ్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. 'ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీకాంత్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో ఆయన కనిపించే అవకాశం ఉంది.
ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. నా గత చిత్రాల్లో చూపించినట్లు డ్రగ్స్ను చూపించను'అని పేర్కొన్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం 'వేట్టయాన్' లో నటిస్తున్నారు. 'జై భీమ్' మూవీ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.