Raj Rachakonda : ‘23’ మూవీ తెలుగులో సంచలనం

Update: 2025-03-08 11:15 GMT

వాస్తవ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. కానీ చరిత్రలో ఎప్పుడు తలచుకున్నా.. కొన్ని దాష్టీకాలు దారుణంగా అనిపిస్తాయి. అలాంటి అంశాలను సినిమాలుగా మలచాలంటే ధైర్యం ఉండాలి. ఆ దారుణాలు ఈ తరానికి అర్థం అయ్యేలా చెబుతూనే కమర్షియల్ గా వర్కవుట్ చేసుకోవాలి. పైగా ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్. మెజారీటీ ధనవంతులు చేసినవీ ఉన్నాయి. అలాంటి అరుదైన ఘటనల నేపథ్యంలో ‘‘23’’ అనే టైటిల్ తో ఓ సినిమా వస్తోంది. గతంలో మల్లేశం, 8ఏ.ఎమ్ మెట్రో మూవీస్ తో మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చకున్న రాజ్ రచకొండ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ టీజరే సంచలనాత్మకంగా ఉంది. ఆ టీజర్ చూస్తే..

‘నేను చూసిన మూడు సామూహిక హత్యాకాండలు.. 1991 చుండూరు మారణహోమం, 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్.. హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకులు కథ ఒకేలా ముగిసిందా..’ అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆయా సన్నివేశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ మూడు సంఘటనలూ అత్యంత దారుణమైనవిగా చరిత్రలో కనిపిస్తాయి. అలాగే వివాదాస్పదమైనవి కూడా. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సినిమా అంటే ఈ దర్శకుడు ఇప్పటి వరకూ తెలుగు సినిమాలను దాటి ఇంకేదో చెప్పబోతున్నాడు అని అర్థం అవుతుంది.

ఇలాంటి ఘటనలను కథా వస్తువుగా తీసుకోవాలంటే అతనికి బాధితుల బాధలు తెలిసి ఉండాలి. లేదంటే అతను ఈ ఘటనలను తనదైన శైలిలో పరిశోధన చేసి ఉండాలి. లేదంటే ఈ తరహా సినిమాలు తీయడం సాధ్యం కాదు. ఏదేమైనా బాధితుల కథల్లో బలం ఉంటుంది. నిజం ఉంటుంది. ఆ నిజం ఈ మూవీతో వెలికి తీస్తారా లేదా అనేది చూడాలి.

స్పిరిట్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. తేజ, తన్మయ్, ఝాన్సీ, తాగుబోతు రమేష్, పవన్ రమేష్, ప్రణీత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Full View

Tags:    

Similar News