Srihari : తెలుగు సినిమా షేర్ ఖాన్ శ్రీహరి జయంతి స్పెషల్

Update: 2025-08-15 04:43 GMT

ఇంతింతై నటుడింతై అనే మాట.. తెలుగులో శ్రీహరికి చక్కగా సరిపోతుంది. గుంపులో ఒకడిగా మొదలైన ప్రయాణం.. ఓ బలమైన పాత్ర రాసుకున్న ప్రతి దర్శకుడికీ ఫస్ట్ ఆప్షన్ గా మారేంత వరకూ ఎదిగింది అతని ప్రస్థానం. కండలు తిరిగిన దేహమే కాదు.. గుండెలనిండా దయనూ నింపుకున్న నటుడిగా శ్రీహరికి గొప్ప పేరు ఉంది. నటుడిగా, వ్యక్తిగా శ్రీహరిది ఎందరికో ఆదర్శనీయమైన జీవితం.ఈ ఆగస్ట్ 15న శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ఆయన సినిమా ప్రయాణాన్ని సారి గుర్తు చేసుకుందాం..

విభిన్నమైన పాత్రలతో తెలుగు వారిని అలరించిన నటుడు శ్రీహరి. బలమైన కారక్టర్ రోల్స్ చేయాలంటే శ్రీహరి వైపే చూసేవారు డైరక్టర్లు. ఒక్క పాత్రలో ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్నిటినీ సిన్సియర్ గా ప్రాక్టీసు చేసి మరీ పండించడం శ్రీహరి ప్రత్యేకత. ఏ కారక్టర్ లోనైనా ఇట్టే ఇమిడిపోతాడు. టాలీవుడ్ షేర్ ఖాన్ గా శ్రీహరి తెలుగు సినిమా మీద వేసిన ప్రభావం తక్కువదేం కాదు. సరిగ్గా మోహన్ బాబు రెండో సారి విలన్ నుంచి హీరోకి షిఫ్ట్ అవుతున్న దశలో ఇండస్ట్రీ ఓ వ్యాక్యూమ్ ను ఫీలయ్యింది. సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చి యంగ్ అండ్ ఎనర్జిటిక్ విలన్ రోల్స్ కు నేనున్నానని భరోసా ఇచ్చాడు శ్రీహరి.

ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ , మోహన్‌బాబు తర్వాత తెలుగు తెర మీద బలమైన కారక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన శ్రీహరి అకాల మరణం తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద లోటు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బ్రహ్మనాయుడు చిత్రం తో తెరంగేట్రం చేశారు శ్రీహరి. 23 ఏళ్ల నటజీవితంలో విలన్ గా హీరోగా కారక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీహరి అందుకున్న స్థానం అనితరసాధ్యం.

శ్రీహరి పుట్టింది దేశానికి స్వతంత్రం సిద్దించిన అగస్ట్ 15న కావడం విశేషం. శ్రీహరి విలన్ గా ఎన్నో దుర్మార్గమైన పాత్రలు చేసినట్టు తెర మీద నటించినా.. నిజజీవితంలో జెంటిల్ మేన్. సినిమాల్లో తెలంగాణ మాండలికానికి గౌరవం పెంచిన నటుడుగా కూడా శ్రీహరి గుర్తుండిపోతాడు. కింగ్, ఢీ , డాన్ శీను తదితర చిత్రాల్లో శ్రీహరి తెలంగాణ మాండలికంలో పలికిన సంభాషణలు అనితరసాధ్యం.

శ్రీహరి స్వంతూరు కృష్ణా జిల్లాలో ఉన్నా ...హైద్రాబాదీగానే పెరిగారు. ఆనాటి విజయవాడ శాసన సభ్యుడు వంగవీటి మోహనరంగా తో సాన్నిహిత్యం ఉండేది. రంగారావు రికమండేషన్ తోనే దాసరిని కల్సారు. క్రూయల్ విలనీతో పాటు హలో బ్రదర్ లాంటి చిత్రాల్లో కామెడీ విలన్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు శ్రీహరి. దాసరి తో పాటు రాఘవేంద్రరావు, మోహన్ బాబు లాంటి వాళ్లు తొలి రోజుల్లో శ్రీహరిని ప్రోత్సహించారు.

విలన్ గా చేస్తున్న శ్రీహరిలో కారక్టర్ రోల్స్ లోనూ అదరగొట్టే సత్తా ఉందని చాటిన చిత్రం శ్రీరాములయ్య. అందులో శ్రీహరి చాలా ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. కోవర్డ్ తరహా పాత్రలో నటించి మెప్పించాడు. చేసింది విలన్ కారక్టరే అయినా అందులో భిన్నమైన ధోరణితో సాగే పాత్ర. దాన్ని అత్యంత సమర్ధవంతంగా పోషించారు శ్రీహరి.

శ్రీ రాములయ్య సినిమాలో శ్రీహరి నటన చూసిన మోహన్ బాబు తన కాంపౌండ్ లోకి తీసుకెళ్లారు. తను హీరోగా చేసిన కలెక్టర్ గారు తదితర చిత్రాల్లో విలన్ గా శ్రీహరికి అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలోనే శ్రీహరి గురించి మాట్లాడుతూ... భవిష్యత్ లో తెలుగు తెర మీద ఎస్వీఆర్ రేంజ్ నటుడు అవుతాడని కామెంట్ చేశారు మోహన్ బాబు. ఒక రకంగా అది నిజం కూడా. విలనీ చేయడం పెద్ద కష్టమేం కాదుగానీ... కామెడీ విలన్ గా ఆడియన్స్ ను మెప్పించగలగడమే గొప్ప. ఆ రూట్ లో శ్రీహరికి బాగా గుర్తింపును తీసుకువచ్చిన చిత్రం చిరంజీవి బావగారూ బావున్నారా..కోట శ్రీనివాసరావు, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఆయన నటన అద్భుతం.

తను చేస్తోన్న పాత్రలను బట్టి ఆయా తరహా మేనరిజమ్స్ పై ప్రత్యేక కసరత్తు చేస్తాడు శ్రీహరి. విలన్ గా చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేసినా.. హీరోగా చేసినప్పుడు కూడా ఈ తరహా వైరుధ్యం మనకు కనిపిస్తుంది. అందుకే శ్రీహరి లొయొస్ట్ స్క్రీన్ స్పేస్ ఉన్న ఆర్టిస్ట్ నుంచి తక్కువ టైమ్ లోనే రియల్ హీరోగా ఎదిగేశాడు..

నిర్మాత మహేంద్ర నిర్మించిన పోలీస్ చిత్రంతో హీరోగా టర్న్ ఇచ్చిన శ్రీహరి సుమారు 28 చిత్రాల్లో హీరోగా చేశారు. వాటిలో కలకాలం నిల్చిపోయే చిత్రాలు అనేకం ఉన్నాయి. హీరోగా జర్నీ పోలీస్ సినిమాతో స్టార్ట్ చేసిన శ్రీహరి.. ఆ యూనిఫామ్ కే వన్నె తెచ్చే ఎన్నో పాత్రల్లో మెరిసాడు. కథను బట్టి సెన్స్ బుల్ కారక్టర్స్ చాలా ఇంప్రెసివ్ గా చేయడం శ్రీహరి స్పెషాల్టీ. అదే తనకు ప్రేక్షకులతో రియల్ స్టార్ అనే బిరుదు ప్రదానం చేయించింది.

పోలీస్ సినిమాతో హీరో అయిన శ్రీహరి నిజంగా పోలీస్ సినిమాల ట్రెండ్ కే గౌరవం తెచ్చాడు. అప్పటి వరకూ విలన్ గా చేసి సడెన్ గా హీరోగా మారినా.. ముందు ఆశ్చర్యపోయిన జనం ఆ తర్వాత అతని ప్రతిభకు ఫిదా అయ్యారు. ఇన్నాళ్లూ ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ నా జస్ట్ విలన్ గా చూశాం అనుకున్నారు. కేవలం స్వయం ప్రతిభతోనే రియల్ స్టార్ గా ఎదిగిన నటుడు శ్రీహరి.

యూనిఫామ్ లోనే కాదు.. దేశభక్తి చిత్రాల్లోనూ శ్రీహరిది ప్రత్యేక స్థానం. ఎవరు చేసినా నటిస్తున్నట్టు కనిపించినా అలాంటి పాత్రలు శ్రీహరి చేస్తేమాత్రం అతను నిజంగానే నిజమైన దేశభక్తుడిగా కనిపిస్తాడు. విజయరామరాజు సినిమాలో శ్రీహరి నటిస్తున్నాడనే ఊహ కూడా ఎవరికీ రాదు. అలాగే హనుమంతులోనూ అంతే. ఏ పాత్ర చేసినా దాని ఔన్నత్యాన్ని ఆకళింపు చేసుకునే అరుదైన నటుల్లో శ్రీహరి ముందు వరుసలో ఉంటాడు.

శ్రీహరిని కేవలం హీరోగా మాత్రమే చూడకూడదు.. అంతకుముందు ఆ తర్వాత అతను చేసిన ఎన్నో మెమరబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటి తను తప్ప ఇంకవెరూ చేయలేరేమో అన్నంత ప్రెజెంట్ చేయడం అతనికే సాధ్యమైన శైలి. అయితే హీరోగా చేసినా అంతే. హనుమంతు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో మనకు శ్రీహరి నట విశ్వరూపమే కనిపిస్తుంది.

స్వతహాగా జిమ్నాస్టిస్ట్ కావడం శ్రీహరికి మాత్రమే దక్కిన అదనపు అదృష్టం. అదే అతన్ని రియల్ స్టార్ గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. అన్ని ఫైట్స్ సహజంగా ఎలాంటి డూప్ లేకుండా చేయడం వల్లే హీరోగా శ్రీహరికి చాలా వేగంగా గుర్తింపూ ఇమేజ్ తెచ్చింది. ఇక పూర్తిగా తన ప్రతిభనే కథగా మలచి ఎన్ శంకర్ తెరకెక్కించిన భద్రాచలంలో అతని పోరాట నైపుణ్యానికి ఫిదా కానివారెవ్వరు..

కృష్ణవంశీ సముద్రంతో కారక్టర్ రోల్స్ లో ఒక గొప్ప వేరియేషన్ తీసుకువచ్చిన శ్రీహరి ఆ తర్వాత వచ్చిన కుబుసం చిత్రంలో పీపుల్స్ వార్ నాయకుడు నల్లా ఆదిరెడ్డిని పోలిన పాత్రను సమర్ధవంతంగా పోషించారు. అందులో ఆయన పాడిన పల్లె కన్నీరు పెడుతుందా పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

శ్రీహరి చేసిన కారక్టర్ రోల్స్ లో ఆయనకు చాలా పేరు తెచ్చిన పాత్ర రాజమౌళి మగధీర. అందులో షేర్ ఖాన్ కారక్టర్ లో యోధుడుగా కనిపించిన శ్రీహరి డేవిడ్ గా అదే స్థాయిలో కామెడీ పండిస్తాడు. ఈ రెండు పాత్రల మధ్య అద్భుతమైన వైవిధ్యాన్ని సాధించగలగడం శ్రీహరికే చెల్లింది. అలా శ్రీహరి తెలుగు సినిమా ఎస్వీఆర్ అవుతాడని మోహన్ బాబు చెప్పిన మాట అక్షరాలా నిజం చేశాడు.

రామ్ చరణ్, మంచు విష్ణు , జూనియర్ ఎన్టీఆర్, సిద్దార్ధ లాంటి యంగ్ హీరోలకు అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ శ్రీహరి చేసిన ప్రతి పాత్రా ప్రేక్షకులను అలరించింది. మగధీర, ఢీ, బృందావనం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలు సాధించిన విజయాల్లో శ్రీహరిది మేజర్ షేర్ అనే మాట ఎవరూ కాదనలేని సత్యం.

తను సినిమాల్లో ఏ తరహా పాత్రల్లో కనిపించినా...వ్యక్తిగా శ్రీహరిలో సామాజిక బాధ్యత ఎక్కువ. అందుకేనేమో...తను హీరోగా చేసిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. రాజకీయ సంబంధాలు ఉన్నప్పటికీ తానెప్పుడూ ప్రజాపక్షంగానే వ్యవహరించేవారాయన. పోలీస్ చిత్రంతో సక్సస్ ఫుల్ గా కెరీర్ నడిపించిన శ్రీహరి హీరోగానూ విలన్ గానూ ద్విపాత్రాభినయం చేస్తూ...పృధ్వీనారాయణ సినిమా నిర్మించారు.

నటుడు కావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలుసు. అందలం ఎక్కాక కూడా అవేవీ మర్చిపోలేదు శ్రీహరి. అందుకే ఆయన ఇల్లు అవకాశాల కోసం వెదుక్కుంటూ వచ్చేవారికి ఓ అన్నదాన సత్రం అనే పేరూ ఉంది. మంచి నటుడుగానే కాదు.. గొప్ప మనసున్న మనిషిగానూ శ్రీహరి స్థానం ఇంకెవరూ భర్తీ చేయలేనిది.. అందుకే శ్రీహరి మరణించిన తర్వాత కూడా నటుడిగా ఆయన పాత్ర ఇండస్ట్రీకి ఇంకా వెలితిగానే ఉంది.

చిన్నప్పటి నుంచీ నటుడు కావాలని కలలు కన్నాడు. నెరవేర్చుకున్నాడు. ఆఖరి శ్వాస కూడా ఆ కళామతల్లి ఒడిలోనే వదిలాడు శ్రీహరి. మరణానికి ముందే కొంతకాలంగా అనారోగ్యం పాలైనా.. నిర్మాతలకు నష్టం రాకూడదని మొండిగా ఎన్నో సినిమాలు చేశాడు. అలాగే ముంబైలో రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ లో ఉండగానే సడెన్ అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది..

నిండా యాభై ఏళ్లు లేవు. శ్రీహరి కన్నుమూశాడంటే ప్రేక్షకులకు నమ్మబుద్ది కాలేదు. కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి. మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాల్లో సేవలందించిన మనస్వి శ్రీహరి. తెలుగు సినిమా ఉన్నంత వరకు...గుర్తుండిపోయే నటుడు శ్రీహరి.. తనదైన సహజ ప్రతిభతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన శ్రీహరి అరుదైన నటుడే కాదు.. మరణం లేని నటుడు కూడా..

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News