మెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ ల విషయంలో అతని నిర్ణయాలు అనేక రంగాలను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా సినిమా పరిశ్రమపై తన ట్యాక్స్ ల ప్రతాపం చూపించబోతున్నానని ప్రకటించడంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ ఉలిక్కి పడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రధానంగా మన సౌత్ సినిమాలపై కాస్త ఎక్కువగా పడబోతోందనేది విశ్లేషకుల అంచనా.
అమెరికా దేశంలో కాకుండా చిత్రీకరణ జరుపుకున్న సినిమాలన్నీటిపైనా 100 ట్యాక్స్ విధించబోతున్నా అని చెప్పాడు ట్రంప్. దీని వల్ల మన దగ్గర నుంచి అమెరికాలో డిస్ట్రిబ్యూట్ అవుతూ ప్రదర్శించబడే సినిమాలపై తీవ్రమైన ప్రభావం పడబోతోంది. అఫ్ కోర్స్ వాల్డ్ వైడ్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది.
అయితే ట్రంప్ నిర్ణయానికి అసలు కారణం.. చైనా సినిమాలు. చైనా మూవీస్ కు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఆ కారణంగా ఆ సినిమాలు అమెరికా నుంచి భారీ లాభాలు పొందుతున్నాయి. ఇదే ట్రంప్ కు నచ్చడం లేదు. చైనా ఒక్కరిపైనే కోపం చూపితే విమర్శలు వస్తాయని.. ఇలా అన్ని దేశాల సినిమాలపై ట్యాక్స్ అస్త్రం సంధించాడు. అయితే ఇది కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ చాలా సినిమాల రైట్స్ తీసుకున్నవాళ్లు నిండా మునిగిపోతారు. కొత్తగా సినిమాలు తీసుకోవాలనుకునేవాళ్లు అక్కడి ట్యాక్స్ లకు తగ్గట్టుగానే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అవీ మాట్లాడుకుంటారు. ఎవరైనా నష్టానికి వ్యాపారం చేయాలనుకోరు కదా. ఇదీ అంతే.
ప్రస్తుతం తెలుగు వారికి ఉత్తర అమెరికా స్ట్రాంగ్ మార్కెట్ గా ఉంది. అక్కడి నుంచి భారీ రెవిన్యూ వస్తోంది. ఇక్కడిలాగే ప్రీమియర్స్ పడుతున్నాయి. అడ్వాన్స బుకింగ్స్ లోనూ రికార్డ్స్ వస్తున్నాయి. అలాంటి మార్కెట్ ట్రంప్ నిర్ణయం వల్ల కుదేలైపోతుంది. అంటే తెలుగు సినిమాకు భారీ లాభాలు తెచ్చే జోన్ మూతపడిపోతుందనే చెప్పాలి. అదే నిజమైతే.. ఇకపై మన సినిమాల బడ్జెట్ లు, రెమ్యూనరేషన్స్ తో పాటు చాలా లెక్కలు మారిపోతాయి. ఆ కారణంగా మొదటి దెబ్బ పెద్ద సినిమాలకే పడుతుంది. అసలే ఏడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేస్తున్నారు మన స్టార్ హీరోలు. ఇలా చేయడం వల్ల బాక్సాఫీస్ కళ తప్పి పోతుంది. సరే అంత కాలం తర్వాతైనా ఓ సినిమా వస్తుంది కదా అనుకుంటే ఇదుగో ట్రంప్ ఎఫెక్ట్ మరింత దెబ్బ వేస్తుంది. ఈ కారణంగా నిర్మాతలు నిండా మునిగిపోతారు. కొంత కాలానికి పరిశ్రమ సైతం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతుంది.
దీనికి తోడు ట్రంప్ ఓటిటి మార్కెట్స్ పై ట్యాక్స్ లు విధిస్తే అది మరో దెబ్బ అవుతుంది. అప్పుడు కేవలం ఇండియన్ సినిమాలకు సంబంధించి కేవలం ప్యాన్ ఇండియా మిగులుతుంది తప్ప ప్యాన్ వరల్డ్ అనే మాటలు ఆవిరైపోతాయి. అఫ్ కోర్స్ అమెరికా ఒక్కటి ఆగిపోతే మొత్తం పోయినట్టేనా అనుకోవడానికి లేదు. అమెరికా తర్వాత ఆస్ట్రేలియా, అరబిక్ స్టేట్స్ లోనూ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. కానీ అరబిక్ స్టేట్స్ లో అనేక ఆంక్షలు ఉంటాయి. సెన్సార్ పరంగా, డైలాగ్స్, సీన్స్ ఇలా ప్రతిదీ పరిగణలోకి వస్తుంది. అవేం లేకపోతేనే వర్కవుట్ అవుతుంది. ఆస్ట్రేలియాలో మార్కెట్ ఉంది. కానీ అమెరికా మార్కెట్ లో సగం కూడా ఉండదు. ఇలా ఎక్కడికక్కడ ఇబ్బందులే ఉన్నాయి. ఏదేమైనా చైనా పై కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. దీని వల్ల హాలీవుడ్ ను బ్రతికిస్తా అన్నాడు. కానీ చాలా హాలీవుడ్ సినిమాలు కూడా విదేశాల్లోనే చిత్రీకరణలు జరుపుకుంటాయి. ఆ సినిమాలకు వచ్చే రెవిన్యూ అమెరికా కంటే ఇతర దేశాల నుంచే ఎక్కువగా ఉంటుంది. సో.. అప్పుడు షూటింగ్ పర్మిషన్స్ దగ్గర నుంచి రిలీజ్ ల వరకూ ఆయా దేశాలు కూడా అమెరికన్ మూవీస్ పై ట్యాక్స్ లు విధిస్తే.. హాలీవుడ్ ను బ్రతికించాలనుకున్న ట్రంప్ కోరిక నెరవేకపోగా.. అసలు హాలీవుడ్ కే ఎసరు వస్తుందనేది కూడా వాస్తవం. సో.. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉండాల్సింది. కానీ అతని దూకుడు చూస్తే ముందు అనేయడం తర్వాత వెనక్కి తగ్గడంలా ఉంది. అంచేత ఈ 100శాతం ట్యాక్స్ అనేది చట్టంగా మారితే అప్పుడు ఆలోచించాలి. అప్పటి వరకూ వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు అనే చెప్పాలి.