ఫ్యామిలీ స్టార్ మూవీతో ఎదురు దెబ్బ తిన్న విజయ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. ఈ చిత్రానికి కథానాయికగా తొలుత శ్రీలీలను అనుకున్నారట. ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు కూడా..! హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్ గా నటించాల్సి ఉండడంతో శ్రీలీల తప్పుకున్నట్లు తెలిసింది.
త్వరలో సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఒక దశలో 'ప్రేమలు' హీరోయిన్ మమిత బైజు పేరు కూడా తెరమీదకు వచ్చింది. కానీ చివరికి 'మిస్టర్ బచ్చన్' సినిమాలో మాస్ రాజా రవితేజతో జత కడుతున్న ముంబై భామ భాగ్యశ్రీ బోర్సేను ఈ చిత్రంలో కథానాయికగా ఖరారు చేశారని తెలుస్తోంది.
విజయ్ పక్కన భాగ్యశ్రీ బాగా సూటవుతుందని భావిస్తున్నారు.‘జెర్సీ'తో గౌతమ్ తిన్ననూరి ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే. తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా అనుకున్నాడు కానీ.. వర్కవుట్ కాలేదు. చివరికి విజయ్ సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం పట్టాలెక్కడంలో కొంత ఆలస్యం జరిగింది.