తమిళ్ హీరో విశాల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే సినిమాల వల్ల కాదు. అనారోగ్య సమస్యల వల్ల. కొన్నాళ్ల క్రితం మధగజరాజా మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు అతని చెయ్యి వణుకుతూ, మొహం అంతా అదోలా అయిపోయి కనిపించాడు. ఆ వీడియో చూసిన అభిమానులు చాలా ఆందోళన పడ్డారు. ఇండస్ట్రీ సైతం విశాల్ కు ఏమైంది అంటూ ఆరాలు తీశారు. అయితే అదేమంత పెద్ద సమస్య కాదు అని తర్వాత అతని పిఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. తాజాగా మరోసారి ఓ ప్రైవేట్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విశాల్.. వేదికపైనే కళ్లు తిరిగిపడిపోవడం సంచలనంగా మారింది. తమిళనాడులోని విల్లుపురంలో ట్రాన్స్ జెండర్స్ అందాల పోటీకి ముఖ్య అతిథిగా వెళ్లాడు విశాల్. ఆ వేదికపైనే కళ్లు తిరిగి పడిపోయాడు. నిర్వాహకులు వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.
ఈ ఘటనపై విశాల్ పీఆర్ టీమ్ స్పందించింది. మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్లే కళ్లు తిరిగి పడ్డారని చెప్పారు. డాక్టర్లు కూడా సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించారు అని చెప్పారన్నారు. నిజానికి విశాల్ ఫిట్ నెస్ గురించి అందరికీ తెలుసు. తన అన్ని సినిమాల్లోని స్టంట్స్ ను తనే చేస్తాడు. డూప్ ను వాడడు. అంత ఫిట్ గా ఉండే విశాల్ ఇలా కళ్లు తిరిగి పడిపోయాడు అంటే.. అదీ కేవలం ఒక్క పూట ఆహారం తీసుకోకపోవడం వల్లే అని చెప్పడం నమ్మదగ్గదిగా కనిపించడం లేదు. అలాగని ఆయనకు ఏదో అయిందని కాదు.. నిజాలేంటో చెప్పలేనప్పుడు ఇలా పబ్లిక్ లోకి రావడం.. అదీ భోజనాలు గట్రా చేయకుండా రావడం చేయకూడదు కదా. ఏదేమైనా విశాల్ ఏం కాలేదు అనే పిఆర్ టీమ్ మాటలు నిజమే అని నమ్ముదాం. ఏదైనా ఉన్నా.. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.