తన తరం హీరోల్లో ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు చేసిన హీరో నాగార్జున. ఇమేజ్ ను దాటి చేసిన ప్రయోగాలూ ఉన్నాయి. వీటిలో చాలా వరకూ సక్సెస్ సాధించినవే ఉన్నాయి. ఎప్పుడు ఏం చేసినా మాగ్జిమం పాజిటివ్ గా ఉండేలానే చూసుకున్నాడు. 90స్ లోనో ఏమో.. బాలీవుడ్ లో ఓ మూవీలో నెగెటివ్ రోల్ చేశాడు. ఆ సినిమా పోయింది. మళ్లీ విలన్ అనలేదు.ఇన్నాళ్లకు.. అది కూడా వంద సినిమాల అనుభవం తర్వాత విలన్ గా మారాడు. ఇదే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించినా.. ఇలాంటి పాత్రలు చేయాలనే నాకూ ఉందని చెప్పి.. కొన్ని చర్చలకు ఎండ్ కార్డ్ వేశాడు కింగ్.
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన 'కూలీ'లో ప్రధాన విలన్ సైమన్ గా నాగ్ నటన గురించి రజినీకాంతే ఓ రేంజ్ లో పొగడ్తలు కురిపించాడు. అసలా పాత్ర తనే చేయాలనుకున్నా అని కూడా చెప్పాడు. మరోవైపు నాగార్జున తన 100వ సినిమాకు సంబంధించి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ తో ఆ సినిమా ఉంటుందనే ప్రచారం ఉంది. సో.. ఇటు హీరోగా సెంచరీ.. అటు సెంచరీ తర్వాత తన కెరీర్ లో ఏం చేయడానికైనా సిద్ధం అనేలా సైమన్ క్యారెక్టర్.
కాకపోతే సైమన్ క్యారెక్టర్ గురించి చెప్పినంత రేంజ్ లో తెరపై కనిపించాలి. నాగార్జున నట విశ్వరూపం చూపించాలి. నాగ్ అంటే ఇప్పటికీ మన్మథుడుగానే చూస్తున్నారు. అలాంటి ఇమేజ్ ను దాటి మెప్పించాలి. అప్పుడే ఈ పాత్ర మరిన్ని కొత్త సైమన్ లాంటి రోల్స్ కు దారి చూపిస్తుంది.