Crime News: ప్రేమోన్మాది చేతిలో డెంటల్ విద్యార్థి దారుణ హత్య
Crime News: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది డెంటల్ విద్యార్థిని తపస్వి. ఆమె మృతదేహాన్ని GGH లో ఉంచారు..;
Crime News: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది డెంటల్ విద్యార్థిని తపస్వి. ఆమె మృతదేహాన్ని GGH లో ఉంచారు.. తపస్వి పేరంట్స్ గుంటూరు చేరుకున్న తరువాత తపస్వి మృతదేహాని పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అయితే మరోవైపు నిందితుడు జ్ఞానేశ్వర్ పెదకాకాని పోలీసుల ముందు హత్యా నేరాన్ని అంగీకరించాడు.. ప్రేమను నిరాకరించడంతోనే హత్య చేశానని జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నట్లు సమాచారం. తపస్వి మృతితో ఆమె స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. .
తపస్వి చాలా ధైర్యవంతురాలని.. తనకు ఇలాంటి సమస్య ఉందని తమకేం చెప్పలేదని బంధువులు అంటున్నారు. ప్రేమ-వేధింపుల గురించి కానీ, తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన విషయం కూడా తమకేమీ తెలియదని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడా జరగకుండా చూడాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తపస్వి బంధువులు కోరుతున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జ్ఞానేశ్వర్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తపస్వితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి.. సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె స్నేహితురాలు అరిచి.. సాయం కోసం పరిగెత్తగా తలుపులు వేసి మరీ తపస్విని ఘోరంగా చంపాడు. ఇక తపస్వి ఘోర హత్యోదంతాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కళ్ల ముందే పుట్టి పెరిగిన బిడ్డ.. ఇలా విగత జీవిగా కనిపించడాన్ని స్వగ్రామం కృష్ణాపురం వాసులు తట్టుకోలేకపోతున్నారు.