Phone Addiction: ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్న తండ్రి.. ఆత్మహత్య చేసుకున్న కూతురు..
Phone Addiction: ఈకాలంలో పిల్లలు ఏ విషయాన్ని ఎలా తీసుకుంటున్నారో చెప్పలేకపోతున్నాం. వారి మనస్థత్వాలు సున్నితంగా మారిపోతున్నాయి.;
Phone Addiction: ఈకాలంలో పిల్లలు ఏ విషయాన్ని ఎలా తీసుకుంటున్నారో అస్సలు చెప్పలేకపోతున్నాం. వారి మనస్థత్వాలు మరింత సున్నితంగా మారిపోతున్నాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్స్ అడిక్షన్ వారిని మరింత మానసికంగా దెబ్బతీస్తోంది. అఆలు నేర్చుకోకముందే స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు పిల్లలు. తాజాగా ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో తన పదిహేడేళ్ల కూతురు ఆత్మహత్య చేసుకోవాలనే పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాలాపూర్‌కు చెందిన వెల్దుర్తి మనోహరాచారి, లావణ్య దంపతులు. పదేళ్లుగా మీర్‌పేట సర్వోదయనగర్‌లో నివాసముంటున్నారు. వీరి పెద్ద కూతురు కౌశిక ఇంటర్ సెకండియర్ చదువుతుంది. తను తరచూ సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుందని గమనించిన తండ్రి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గేమ్స్ ఆడడం ఆపేసి పడుకోవాలని మందలించి బయటకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన కౌశికి క్షణికావేశంలో బెడ్‌రూంలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
గదిలో నుంచి అరుపులు వినపడడంతో గమనించిన తల్లి కిటికీలోంచి చూడగా.. కౌశికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అదే గదిలో పడుకున్న చిన్న కుమార్తె అరుపులకు లేచి గడియ తీసింది. వెంటనే తల్లి స్థానికుల సాయంతో కౌశికిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది.
స్మార్ట్ ఫోన్స్ అనేవి పిల్లలను ఏ పని చేయడానికి అయినా తెగించేలా చేస్తున్నాయి. కొందరు పిల్లలు అలాంటి టెక్నాలజీని మంచిగా ఉపయోగిస్తూ చదువుల్లో దూసుకుపోతుంటే.. చాలావరకు పిల్లలు మాత్రం దానికి అడిక్ట్ అయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫోన్ అడిక్షన్ ఉన్న పిల్లలను తల్లిదండ్రులు మందలించడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.