Srikakulam : వివాహేతర సంబంధానికి మరో భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య..

Update: 2025-08-15 12:45 GMT

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. మానవ సంబంధాలు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి అనడానికి మరో ఉదాహరణగా నిలిచింది ఈ ఘటన. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. భర్త, పిల్లలను కాదనుకొని ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఆ ఇల్లాలు ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతుంది. తల్లి, తండ్రి లేక ఆ పిల్లలు ఇద్దరు అనాథలుగా మారారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మొండిగొల్లవీధికి చెందిన నల్లి రాజు అనే వ్యక్తికి మౌనిక తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో అక్రమ సంబంధం చిచ్చు రాజేసింది. ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్న మౌనిక అతనితో వివాహేతర సంబంధాన్ని సాగించింది. భర్తకు ఈ విషయం తెలిసి ఆమెను అనేక సార్లు మందలించినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడితోనే కలిసి జీవించాలనుకున్న మౌనిక భర్తను చంపేందుకు సిద్ధం అయింది. ఉదయ్ కుమార్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి మౌనికతోనే ఉండాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి తమకు అడ్డు వస్తున్న మౌనిక భర్తను హత్య చేయాలని భావించారు.

ఈ క్రమంలో వారి మొదటి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. మొదట అమ్మాయిలా చాటింగ్ చేసి మౌనిక భర్తను బయటకు రప్పించి హత్య చేయాలని ప్లాన్ చేశాడు ఉదయ్ కుమార్. కానీ మౌనిక భర్త రాజు బయటకు వెళ్లకపోవడంతో ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ నెల 5న నాలుగు నిద్రమాత్రలు కలిపిన అన్నం భర్త కు పెట్టింది మౌనిక. ఆరోజు అతని నీ గమనించి మరుసటి రోజు నిద్ర మాత్రల డోస్ ను పెంచింది. దీంతో రాజు మత్తులోకి జారుకున్నాడు. వెంటనే ప్రియుడికి ఫోన్ చేయగా అతడి స్నేహితుడు తో కలిసి వచ్చిన ఉదయ్ కుమార్ మౌనిక తో కలిసి రాజును హత్య చేశారు. తరవాత డెడ్ బాడీని, మృతుడి బైక్ ను గ్రామంలో ఒకచోట పడేశారు. మరుసటి రోజు గ్రామస్థులు డెడ్ బాడీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు...దర్యాప్తు చెయ్యగా ఉదయ్ కుమార్ అతడి స్నేహితుడు మృతదేహాన్ని పడేసినట్టు గుర్తించారు. అనంతరం తమ స్టైల్ లో విచారించగా రాజును తామే హత్య చేశామని మౌనిక, ఆమె ప్రియుడు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News