ఝార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీహ్ జిల్లా, డుమ్రీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మహిళపై జరిగిన అమానవీయ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆభరణాలు దొంగిలించిందన్న అనుమానంతో 36 ఏళ్ల మహిళను గ్రామస్థులు అత్యంత దారుణంగా హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తమ ఇంట్లో దొంగతనం చేసిందన్న ఆరోపణలతో నాగేశ్వర్ యాదవ్ కుటుంబ సభ్యులు మహిళపై దాడి చేశారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, ఆమె జుట్టు కత్తిరించి, చెప్పుల దండ వేసి, అర్ధనగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అయితే ఈ దారుణాన్ని గ్రామస్థులు చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ అడ్డుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను గ్రామస్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వీడియోల ఆధారంగా స్పందించిన డుమ్రీ పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేశ్వర్ యాదవ్ కుటుంబానికి చెందిన నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలు ఆభరణాలు దొంగిలించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టంచేశారు. అంతేకాకుండా, ఆమెపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు కాలేదని వెల్లడించారు.