దేశ రాజధానిలో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో సీబీఐ జరిపిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. ఈ సంపద విలువ దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. లంచం కేసులో ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింగల్ పట్టుబడ్డారు. ఈ కేసులో సీబీఐ ఢిల్లీ, ముంబై, పంజాబ్ లో ఆయనకు చెందిన పలు స్థలాలపై తనిఖీలు జరిపింది. ఈ దాడుల్లో రూ.1 కోటి విలువైన నగదు, బంగారు ఆభరణాలు, రూ.3.5 కోట్ల విలువైన వెండి, బంగారు నాణేలు లభించాయి. 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి, ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ టాక్స్ పేయర్ సర్వీసెస్లో అదనపు డైరెక్టర్ జనరల్ పదవిలో ఉన్న అమిత్ కుమార్ సింగల్ అక్రమాస్తులు, నేరారోపణకు సంబంధించిన పలు ఆధారాలు దొరికాయి. ఈ దాడుల్లో సదరు అధికారికి వివిధ బ్యాంకుల్లో లాకర్లు, 25 బ్యాంకు ఖాతాల పత్రాలు, ఢిల్లీ, ముంబై, పంజాబ్ లో ఉన్న స్థిరాస్తులు, ఆస్తుల పత్రాలు కూడా బయటపడ్డాయని సీబీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు.