ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. ఈ కేసులో ₹60.48 కోట్ల మోసం జరిగినట్లు తెలుస్తోంది.శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తమ కంపెనీ 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్'లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని నమ్మించి తన నుంచి ₹60.48 కోట్లు తీసుకున్నారని కోఠారి ఆరోపించారు. కోఠారి ఫిర్యాదు ప్రకారం, శిల్పా శెట్టి దంపతులు మొదట తమకు ₹75 కోట్లు అప్పు కావాలని 12% వడ్డీతో అడిగారు. అయితే పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా చూపించాలని కోఠారిని ఒప్పించారు. దీనికి అంగీకరించిన కోఠారి, 2015 ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని బెస్ట్ డీల్ టీవీ కంపెనీ ఖాతాల్లోకి బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత తన డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆ నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని కోఠారి ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మోసం చేసిన మొత్తం ₹10 కోట్లకు మించి ఉండటంతో ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. అయితే, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వివాదం పూర్తిగా సివిల్ సంబంధమైనదని, ఇందులో ఎలాంటి క్రిమినల్ అంశాలు లేవని ఆయన తెలిపారు.