లోన్ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి.సుధీర్ బాబు అన్నారు. ఆదివారం సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "బాధితులు ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో, వారి ఫోన్లపై నేరస్తులు నియంత్రణ పొందుతారు. ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండా చిన్న మొత్తంలో రుణాలు ఇస్తారు. కానీ తర్వాత బాధితుల ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కేవలం రెండు వేల నుండి అయిదు వేల రూపాయల వరకు అప్పుగా ఇచ్చి, ఆ తర్వాత లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకుంటే బాధితుల మార్పిడి ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తామని లేదా వాళ్ల పరిచయస్తులకి పంపుతామని బెదిరింపులకు పాల్పడుతారు. వారి బ్లాక్ మెయిల్ కు లొంగిపోయి బాధితులు వేలు, లక్షల రూపాయలు పోగొట్టుకోవడమో లేదా అవమానంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తున్నారు. లోన్ యాప్ నేరగాళ్ల బారిన పడకండి, ఒకవేళ మీరు బాధితులు అయితే వెంటనే-100 లేదా 1930 కు కాల్ చేయండి. భయం వద్దు, భరోసాగా మీకు మేమున్నాము" అని పేర్కొన్నారు.