Cyber Fraud : ఐటీ, ఈడీ పేరిట సైబర్ దోపిడీ!.. ఫెడెక్స్ కొరియర్ పేరిట మోసాలు
రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకి పేట్రేగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు రోజుకో మార్గంలో రెచ్చిపోతూ, దొరికినంత దోచుకో అన్న రీతిలో అమాయకుల సొమ్మును స్వాహా చేస్తున్నారు. కాగా సైబర్ మోసాల బాధి తులలో 70శాతం సంపన్నులుండగా, 30 శాతం సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నట్లు పోలీసులు రికార్డులు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది వేలాది మందిని ఫెడెక్స్ కొరియర్ పేరిట మోసగించిన సైబర్ నేరస్థులు తాజాగా ఐటీ, ఈడీ, కస్టమ్స్, సీబీఐ, ఎస్ఐల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. తాము ఐటీ, ఈడీ నుంచి మాట్లాడుతున్నామని, ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా నంబర్లు చెబుతూ మీ ఖాతాల నుంచి లక్షల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని, మీ పేరుతో వచ్చిన పార్శి ల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ భయబ్రాంతులకు గురిచేసి అందినకాడికి దండుకుం టున్నారు. ఇటీవల కాలంలో ఐటీ, ఈడీ పేరిట సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, కేటుగాళ్ల మాటలకు బెదరకుండా లైట్ తీసుకోవటమే ఉత్తమమైన మార్గమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో గడచిన రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తం గా 200 మంది నుంచి రూ.24కోట్ల పైగా సైబర్ నేరస్థులు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.