DRDO Staff Arrested : పాక్ ఐఎస్‌ఐకి గూఢచర్యం.. డీఆర్‌డీవో సిబ్బంది అరెస్టు
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.నిందితుడి మహేంద్ర ప్రసాద్ (32), ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందినవాడు. జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్న డీఆర్‌డీవో గెస్ట్‌హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ప్రాంతం మిస్సైల్ ఇతర ఆయుధాల పరీక్షలకు ఒక కీలక కేంద్రం. రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో మహేంద్ర ప్రసాద్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు మరియు భారత సైన్యం అధికారులు చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించినప్పుడు వారి కదలికలు, మిస్సైల్, ఇతర ఆయుధాల పరీక్షలకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, పాక్ ఏజెంట్లతో చాట్ చేసిన ఆధారాలు లభ్యమయ్యాయి. అధికారిక రహస్యాల చట్టం, 1923 (Official Secrets Act, 1923) కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టు భారత రక్షణ సంస్థలలో భద్రతాపరమైన లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరనున్నారు.