ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు భౌతిక దాడులకు పాల్పడటంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ దాడుల తోటి తమను భయపెట్టాలని అనుకుంటే అది భ్రమ. తప్పకుండా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. వరదలకు ప్రజలు తిండి, నీళ్లు లేక అల్లాడుతుంటే పట్టించుకోలేదు. పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులపై రాళ్ల దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, దాన్ని రౌడీయిజంతో అణిచివేయాలని చూస్తున్నారా? ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలన్నారు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులని డిమాండ్ చేస్తున్నా.. మాపై జరిగిన దాడికి మీకు సంబంధం లేకుంటే దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. మా కార్యకర్తను కారు ముందుకి దొబ్బి చంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు మీద దాడికి దిగారని ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.