యోయో హనీసింగ్‌గా ప్రజాదరణ పొందిన ప్రముఖ సింగర్ ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాడు. సింగర్ సిద్ధూ మూసే వాలాను హతమార్చిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బరార్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులను ఆశ్రంచాడు. ఘటనపై పోలీస్ ప్రధాన కార్యాయంలో ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు భద్రత కల్పించాలని అభ్యర్థించాడు.
కొద్ది రోజులుగా హనీసింగ్‌కు, ఆయన సిబ్బందికి అంతర్జాతీయ ఫోన్ నెంబర్‌ల నుంచి కాల్స్ వస్తున్నాయి. గోల్డీ బరార్ పేరుతో పలు వాయిస్ నోట్‌లూ వచ్చాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు FIR నమోదు చేశారు కమీషనర్.
సింగర్‌ను కాల్చి చంపి..
గతేడాది మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామ సమీపంలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలాను తన కారులోనే అతి కిరాతకంగా కాల్చి చంపారు. సతీందర్‌జిత్ సింగ్ బరార్ అలియాస్ గోల్డీ బరార్ ఈ కేసులో ప్రధాన నిందితుడు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్న గోల్డీ సిద్ధూ మూసే వాలాపై దాడికి ఫేస్‌బుక్ పోస్ట్‌లో బాధ్యత వహించాడు. విక్కీ మిద్దుఖేరా మరణానికి ప్రతీకారంగా సిద్ధూ మూస్ వాలా హత్య చేసినట్లు అంగీకరించాడు.
1994లో జన్మించి, BA పట్టభద్రుడైన గోల్డీ బ్రార్ 2017లో స్టూడెంట్ వీసాపై కెనడా వెళ్లాడు. మూసేవాలా హత్య తర్వాత కెనడాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశపు ఫ్యుజిటివ్ అప్రెహెన్షన్ సపోర్ట్ టీమ్ గోల్డీని టాప్ 25 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్స్ జాబితాలో చేర్చింది.
అయితే, ఇదివరకే ఓ సింగర్ హత్య కేసులో నిందితుడైన గోల్డీ ఇప్పుడు హనీసింగ్‌నే ఎందుకు టార్గెట్ చేశాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. బెదిరింపు కాల్స్ తర్వాత తన కుటుంబం భయాందోళనకు గురైందని మీడియాకు వెల్లడించారు హనీసింగ్. తమకు అండగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, గోల్డీ తన నుంచి ఏం డిమాండ్ చేశారనేది స్పష్టం చేయలేదని తెలిపాడు.