యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి భార్య కంతీదేవితో గొడవపడి, కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషభ్) గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ భార్య చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలంతా 13 నుంచి 5 ఏళ్ల లోపు వారే. రాజీవ్ మెంటల్ హెల్త్ సరిగా లేదని పోలీసులు తెలిపారు. మన్పుర్ చచారి గ్రామానికి చెందిన రాజీవ్ కుమార్ (36) దంపతులకు నలుగురు సంతానం. 12,9,7,5 ఏళ్ల వయసున్న ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం రాత్రి అతడు ఒక పదునైన ఆయుధంతో తన నలుగురు పిల్లల గొంతు కోసి చంపేశాడు. తర్వాత వేరే గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘోరాన్ని మృతుడి తండ్రి గురువారం గుర్తించారు. ‘‘ఉదయం రాజీవ్ ఎంతసేపటికీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన అతడి తండ్రి ఇంటిపైకప్పు మీదకు వెళ్లి, అక్కడినుంచి మెట్లమార్గం ద్వారా లోపలికి వెళ్లాడు. అప్పుడే ఈ ఘటన గురించి తెలిసింది’’ అని పోలీసులు తెలిపారు. ఏడాదిక్రితం రాజీవ్ తలకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించి చికిత్స తీసుకున్నాడు. ఆ గాయం తగిలిన దగ్గరినుంచి అతడు ప్రతిదానికి ఆందోళనకు గురవుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు అతడి భార్య ఇంట్లో లేదు. ఆమె ముందురోజే పుట్టింటికి వెళ్లినట్లు చెప్పారు. మృతుడు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.