Hyderabad Drugs : డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు..
Hyderabad Drugs : హైదరాబాద్‌లో డ్రగ్ ముఠా గుట్టు రట్టయ్యింది.;
Hyderabad Drugs : హైదరాబాద్‌లో డ్రగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్న పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని.. 9 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నరేందర్ నారాయణ్‌దాస్‌ను అరెస్ట్ చేశారు. నరేందర్ నారాయణ్‌దాస్ ఇంటిపై దాడి చేసే సమయంలో.. పోలీసులపై పెంపుడు కుక్కలను వదిలాడు. దాదాపు 100 కుక్కలను వదలడంతో... నారాయణ్‌దాస్ కాంపౌండ్‌కు వెళ్లడానికే కష్టమైంది. అతికష్టం మీద ఎట్టకేలకు పోలీసులు... అతడ్ని అరెస్ట్ చేశారు.
క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిందితులంతా ఉన్నత చదువులు చదువుకున్నవారేనని... వీళ్లకు 450 మంది కంజుమర్స్ ఉన్నారని తెలిపారు. పలు ఐడీలతో ఆపరేటింగ్ చేస్తున్నారని.. ఇప్పటివరకు 15 లక్షల రూపాయల వరకు లావాదేవీలు జరిపారని అన్నారు. మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇక డ్రగ్స్ వాడుతున్నవారిలో కొందరు విద్యార్థులు ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని... కొరియర్స్ ద్వారా డ్రగ్స్ సప్లై జరుగుతోందన్నారు. ఇంటికి వచ్చే ప్రతి కొరియర్స్‌ను తల్లిదండ్రులు పరిశీలించాలని సూచించారు. మొత్తం 600 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.