Maharashtra : మహారాష్ట్రంలో అమానుషం.. శిశువును బస్సులో నుంచి విసిరేసిన వైనం..
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పర్‌బాణీ జిల్లాలో కదులుతున్న బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ.. కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డను కిటికీలో నుంచి విసిరేసింది. దీంతో ఆ శిశువు మృతి చెందింది. రితికా ధేరే అనే మహిళ.. తన భర్త అల్తాఫ్‌షేక్‌తో కలిసి పూణే నుంచి పర్‌బాణీకి స్లీపర్ కోచ్ బస్సులో ఎక్కారు. మార్గమధ్యలో ఆమెకు పురిటినొప్పులు రావడంతో బస్సులోనే ప్రసవించింది. మగ బిడ్డ పుట్టగా.. కాసేపటికే ఆ బిడ్డను వారు ఒక బట్టలో చుట్టి కిటికీలోంచి బయటకు విసిరేశారు. బస్సు డ్రైవర్ గమనించి అల్తాఫ్‌ను ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేదు.
స్థానికులు బస్సు కిటికీ నుంచి ఏదో పడడం చూసి అక్కడి వెళ్లి చూశారు. బట్టలో చుట్టిన శిశువును చూసి షాకయ్యారు. అప్పటికే ఆ బిడ్డ చనిపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. పెట్రోలింగ్ సిబ్బంది సాయంతో బస్సును అడ్డుకున్నారు. బస్సులోని ప్రయాణికులను విచారించిన అనంతరం రితికా, అల్తాఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆ బిడ్డను పెంచే స్థోమత తమకు లేదని, అందుకే అలా చేశామని వారు పోలీసులకు తెలిపారు. అయితే వారు భార్యభర్తలు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఆ యువతిని వైద్య సంరక్షణ కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.