ప్రయాగ్‌రాజ్ విద్యార్థి హత్య కేసులో కీలక పరిణామం: నరబలికి సూచించిన తాంత్రికుడు అరెస్ట్

Update: 2025-09-01 14:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన 11వ తరగతి విద్యార్థి హత్య కేసులో పోలీసులు కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న ఓ తాంత్రికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తొలగించడానికి నరబలి ఇవ్వాలని సలహా ఇచ్చి, ఒక యువకుడి ప్రాణాలు బలిగొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అగస్టు 26న ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పీయూష్ సింగ్ అలియాస్ యశ్ అనే విద్యార్థిని అతడి తాత సరణ్ సింగ్ దారుణంగా హతమార్చాడు. తన ఇంటికి వచ్చిన మనవడిని చంపి, మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సరణ్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

కాగా ఈ హత్య వెనుక కౌశాంబీ జిల్లాకు చెందిన మున్నాలాల్ (45) అనే తాంత్రికుడి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబంలో వరుస ఆత్మహత్యల కారణంగా సరణ్ సింగ్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న మున్నాలాల్, ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నమ్మించి, వాటిని తరిమికొట్టడానికి మనవడిని బలి ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా, మృతదేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి వేర్వేరు దిక్కుల్లో పడేయాలని కూడా సలహా ఇచ్చాడు. మున్నాలాల్ మాటలను గుడ్డిగా నమ్మిన సరణ్ సింగ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో మున్నాలాల్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మూఢనమ్మకాల కారణంగా ఒక అమాయక విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News