న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన నిజాలు!
నాలుగు నెలల క్రితమే వామన్‌రావును హతమార్చేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది.;
తెలంగాణలో సంచలనం రేపిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. నాలుగు నెలల క్రితమే వామన్‌రావును హతమార్చేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది. బిట్టు శ్రీనును అరెస్ట్ చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనుతో బిట్టు శ్రీనుకు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే వామనరావు దంపతుల గురించి చర్చకు వచ్చింది. గ్రామంలో తన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నట్లు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. నాలుగు నెలల క్రితమే.. గుంజపడుగు వచ్చిన వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీను యత్నించాడు.
హత్యలో పాలు పంచుకున్న కుంట శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను ఈ నెల 18న అరెస్ట్ చేయగా.. వారికి కత్తులను, కారును సమకూర్చిన బిట్టు శ్రీనును 19న అదుపులోకి తీసుకున్నట్లు తీసుకుని విచారించారు. వామన్‌రావును హత్య చేసేందుకు బిట్టు శ్రీను ట్రాక్టర్ పట్టీలతో రెండు కత్తుల్ని తయారు చేయించాడు. నాలుగు నెలలుగా ఎప్పుడు దొరకుతారా అని చూశారు. ఈనెల 17న మధ్యాహ్నం వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చినట్టు కుంట శ్రీనుకు తెలిసింది. అతను వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్ చసి విషయం చెప్పాడు. వెంటనే శివందుల చిరంజీవికి ఫోన్ చేసి మంథని బస్టాప్‌కు రావాలని బిట్టు శ్రీను ఆదేశించాడు. అనంతరం బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇచ్చి పంపాడు. కల్వచర్ల వద్ద వామన్‌రావు దంపతులను చంపిన అనంతరం బిట్టు శ్రీనుకు ఫోన్ చేశాడు. వెంటనే మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సిందిగా బిట్టు శ్రీను.. చిరంజీవికి సూచించాడు.
పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని వామన్‌రావు ఆరోపణలు చేస్తుండటం, ప్రజల్లో చులకన కలిగేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుండటంతో ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్న బిట్టు శ్రీను కోపం పెంచుకున్నాడు. అలాగే మంథని పంచాయతీలో బిట్టు శ్రీను చెత్త తరలింపునకు ఒక ట్రాక్టర్‌ను పెట్టి నడిపిస్తున్నాడు. దానిపై ప్రతి నెలా 30 వేల ఆదాయం వచ్చేది. 2019లో వామన్‌రావు అధికారులపై ఒత్తిడి చేయడంతో వారు దాన్ని తొలగించారు. ఇలా ప్రతి విషయంలో అడ్డుపడటమే కాకుండా వాటన్నింటినీ తాను సాధించిన విజయాలుగా వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడాన్ని బిట్టు శ్రీను జీర్ణించుకోలేకపోయాడు.
గుంజపడుగలో కుంట శ్రీను నిర్మిస్తున్న గుడి నిర్మాణం అక్రమమని వామన్‌రావు, నాగమణి దంపతులు ఫిర్యాదు చేసి కోర్టు నోటీసులు అతికించారు. గతంలోనూ ఓ ఫోన్‌కాల్ విషయమై కుంట శ్రీనుపై కేసు పెట్టడంతో వారి మధ్య వైరం కొనసాగుతోంది. గ్రామంలోని గోపాలస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్‌గా వామన్‌రావు తమ్ముడు కొనసాగుతుండగా, కుంట శ్రీను గ్రామస్థుల సహకారంతో పాత కమిటీని రద్దుచేసి వెల్ది వసంతరావును ఛైర్మన్‌గా నిర్ణయించాడు. ఈ విషయమై వామన్‌రావు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా అన్ని రకాలుగా తనకు అడ్డువస్తున్నాడని కుంట శ్రీను కూడా బిట్టు శ్రీను వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. క్రమంగా ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు తొలగించుకుంటే కాని తమకు భవిష్యత్తు ఉండందని అనుకునేవారు.
ముందుగా కుంట శ్రీను, చిరంజీవిలతో పాటు కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. వామన్‌రావు దంపతుల హత్యకేసు నిందితుడు బిట్టు శ్రీనును సాయంత్రం మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఘటన జరిగిన తర్వాత బిట్టు శ్రీను ఎవరెవరితో మాట్లాడాడో డేటా సేకరించారు. రిమాండ్‌లో ఉన్న నిందితుల ఫోన్ డేటాపై కూడా దృష్టి పెట్టారు. అటు.. వామన్‌రావు హత్యకేసులో పోరాటానికి సిద్ధమయ్యారు మంథని న్యాయవాదులు. ఇవాళ్టి నుంచి మార్చి 1 వరకు విధులు బహిష్కరిస్తామన్నారు. సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టుకి లేఖ రాశారు. నిందితుల తరపున ఎవరూ వకాల్తా తీసుకోవద్దని బార్ అసోసియేషన్లకు సూచించారు. రామగుండం సీపీ సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ చేయనున్నారు. ఇక.. న్యాయవాదులను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సీపీ సత్యనారాయణ వివరణ ఇచ్చారు.