పేగు బంధాన్ని, మానవత్వాన్ని మర్చిపోయి తల్లిపాలిట కాలయముడయ్యాడు ఓ కొడుకు. కేవలం ఆస్తి రాసివ్వలేదన్న నెపంతో కన్న తల్లిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ సిటీకి సమీపాన ఉన్న తెల్లాపూర్ లో చోటుచేసుకుంది. కొడుకు కార్తీకరెడ్డి పొడిచిన కత్తి పోట్లకు గురై తల్లి రాధిక (55) ప్రాణాలు కోల్పోయింది. కొల్లూరు ఇన్ స్పెక్టర్ కథనం ప్రకారం వివరాలివి. తెల్లాపూర్ డెవినో విల్లాల్లో నివాసముంటున్న నవారి మల్లారెడ్డి, రాధికలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సందీప్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు కొద్దిరోజుల క్రితం వివాహం చేశారు. రెండో కుమారుడు కార్తీక్ బీకాం కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. మల్లారెడ్డికి తెల్లాపూర్లో రెండు ఎకరాల భూమి ఉండగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా కార్తీక్ రెడ్డి ఆస్తిని పంచి తన వాటా తనకు ఇవ్వాలని ఇంట్లో గొడవ చేస్తున్నాడు. మద్యానికి బానిస అయిన కార్తీక్ రెడ్డి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి అందరితో గొడవ పడటం సాధారణమై పోయింది. ఆస్తి పంచి ఇమ్మంటున్నా ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులపై కార్తీక్ రెడ్డి కోపం పెంచుకున్నాడు. ఒకవేళ ఆస్తి పంచి ఇవ్వకపోతే అందరిని హత మార్చేందుకు సైతం సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం కార్తీక్ రెడ్డి మద్యం సేవించి ఆస్తి పంచి ఇవ్వాలని తగాదా పడటమే కాకుండా కత్తితో తల్లి పైకి వెళ్లాడు. అప్పుడు కుటుంబ సభ్యులందరూ వారించి త్వరలోనే రాసిస్తామని చెప్పినా వినకుండా పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.