Manneguda Kidnap Case: నవీన్ రెడ్డి వ్యవహార శైలిపై కొత్త విషయాలు వెలుగులోకి..

Manneguda Kidnap Case: మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు, మిస్టర్‌ టీ ఎండీ నవీన్‌రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు.;

Update: 2022-12-14 11:41 GMT

Manneguda Kidnap case: మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు, మిస్టర్‌ టీ ఎండీ నవీన్‌రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం ఆదిభట్ల పోలీసులు అతన్ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌రెడ్డిపై ఆదిభట్లలో మూడు కేసులు ఉండగా.. వరంగల్‌లో రెండేళ్ల క్రితం మరో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడిపై పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నట్లు సమాచారం. నవీన్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




ఇక.. నవీన్‌రెడ్డి వ్యవహార శైలిపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. యువతికి అమెరికా పెళ్లి సంబంధం రావడంతో.. ఈనెల 9న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి.. యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు మిస్టర్-టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. ఉదయం పదకొండున్నర గంటలకు మూడు కార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని సిరిటౌన్ షిప్‌లో ఉండే యువతి ఇంటికి చేరుకున్నాడు.



కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి దామోదర్ రెడ్డి, బాబాయ్ పైనా దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. యువతిని ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. తన కారులో కూర్చోబెట్టాడు. నవీన్ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయారు.నల్గొండ వైపు వెళ్లే మార్గంలో నవీన్ రెడ్డి.. యువతిని కొట్టడంతో ఆమె నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి.




మిగతా నిందితులంతా మన్నెగూడ వైపు పారిపోయారు. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్.. ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని వెంటనే నవీన్ రెడ్డిని అప్రమత్తం చేశాడు. యువతిని ఇంటి వద్ద వదిలేద్దామని నిర్ణయించుకున్న నవీన్ రెడ్డి, అతని ఇద్దరు స్నేహితులు.. నల్గొండకు 20 కిలోమీటర్ల దూరంలో కారు దిగిపోయారు.



స్నేహితుడు సహాయంతో యువతిని ఇంటికి పంపాడు నవీన్‌రెడ్డి. రూమెన్ మాత్రం ఆ యువతిని కారులో ఎక్కించుకొని మన్నెగూడ వైపు పయనమయ్యాడు. 9వ తేదీ సాయంత్రం ఆరున్నరకు రూమెన్ ఫోన్ యువతికి ఇచ్చి తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆ తర్వాత వెంటనే ఫోన్ లాగేసుకొని స్విచాఫ్ చేశాడు. మన్నెగూడకు చేరుకున్న తర్వాత మరోసారి ఫోన్ ఆన్ చేసి యువతికి ఇచ్చి మన్నెగూడలోని ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నట్లు చెప్పించాడు.




వెంటనే రూమెన్ తన ఫోన్ తీసుకొని స్విచాఫ్ చేసి కారులో పారారయ్యాడు. కారును శంషాబాద్ మండలం తొండుపల్లిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కేసులో మొత్తం 36మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 32మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అందులో అయిదుగురిని కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు.. కిడ్నాప్‌ ఘటనపై నవీన్‌ రెడ్డి మాట్లాడుతున్న ఒక సెల్ఫీ వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌ చేయడం తప్పేనని అంగీకరిస్తున్నానని అతను పేర్కొన్నాడు. 

Tags:    

Similar News